అజ్ఞాతంలోకి మాజీ సీఎం కుమారుడు

16:20 - November 6, 2018

పాట్నా: కలవని మనసులతో కాపురం చేయలేమనుకున్న బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గత శుక్రవారం విడాకులకు అప్లయ్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో రెండు కుటుంబాల నుంచి నష్ట నివారణ చర్యలు మొదలయ్యాయి. భార్యకు విడాకులు ఇచ్చే విషయంలో ఆలోచన విరమించుకోవాలని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి తీవ్రమవటంతో తేజ్ ప్రతాప్ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు.
ఐశ్వర్య తాను ఉత్తర,దక్షిణ ధృవాలమని, ఇద్దరి ఇష్టాయిష్టాలు, వ్యవహారాలు పూర్తిగా విరుధ్దమని, పెళ్లి తర్వాత జీవితం చాలా కష్టంగా గడుస్తోందని విడాకుల దరఖాస్తులో తేజ్ ప్రతాప్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజి నుంచి ఐశ్వర్య పీజీ చేయగా తేజ్ ప్రతాప్ స్కూల్ లెవల్లోనే  చదువు ఆపేశారు. బీహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలైన ఐశ్వర్యతో తేజ్ ప్రతాప్ కు మే 12 న వివాహాం జరిగింది. కేవలం రాజకీయ లబ్ది చేకూరుతుందనే ఈపెళ్లి చేశారని, తనుకు ఈపెళ్లి ఇష్టం లేదని చెప్పినా ఎవరూ వినలేదని విడాకులకు అప్లయ్ చేసిన తర్వాత తేజ్ ప్రతాప్ వాపోయారు. 
కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువవటంతో గత రెండురోజులుగా బోధ్ గయలోని హోటల్లో బస చేసిన తేజ్ ప్రతాప్ వ్యక్తిగత సెక్యూరిటీ కళ్లు గప్పి సోమవారం మధ్యాహ్నం హోటల్ రూంలోని వెనుక డోర్ నుంచి  ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడి భక్తుడైన తేజ్ ప్రతాప్ బృందావనం వెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. విడాకుల పిటీషన్ వేయటానికి ముందు కొన్ని రోజుల క్రితం తేజ్ ప్రతాప్ మధుర,బృందావనం సందర్సించి వచ్చారు. కాగా తేజ్ ప్రతాప్ విషయంపై లాలూ కుటుంబ సభ్యులు ఇంతవరకు స్పందించలేదు. 

Don't Miss