శ్రీనివాసరావు ఎఫెక్ట్.. రెండు కుటుంబాలకు నిద్రలేని రాత్రులు

09:34 - November 3, 2018

విశాఖపట్నం: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఒక రాంగ్‌కాల్‌ కూడా జీవితాలను ఇబ్బందుల్లో పడేస్తుందని మీకు తెలుసా. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్‌ పట్ల అప్రమత్తంగా లేకపోతే ఏం జరుగుతుందో మీరెప్పుడైనా చూశారా? ఓ రాంగ్‌కాల్‌ కారణంగా ముగ్గురి జీవితాలు భారీ కుదుపునకు గురయ్యాయి. అంతేకాదు ఆ కుటుంబాల్లోని వారంతా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఇంతకీ ఆ రాంగ్‌కాల్ కహానీ ఏంటనే వివరాల్లో వెళితే..

ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందో లేదో తెలియదుకానీ... ఒక రాంగ్‌కాల్‌ మాత్రం మన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. తెల్లారితే ఏం జరుగుతుందోన్న వేదనను అనుభవించాల్సి వస్తోంది. ఇదంతా నిలువెత్తు నిదర్శనమే.. జగన్ దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు బారిన పడిన వ్యక్తులు.

జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు చేసిన దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఏపీ ప్రతిపక్షనేత జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. శ్రీనివాసరావు జగన్‌పై దాడి చేయడం.. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయడం... ఆ తర్వాత కస్టడీకి తీసుకోవడం జరిగిపోయాయి. అయితే పోలీసుల కస్టడీలో శ్రీనివాసరావు అనేక కీలక విషయాలు వెల్లడించాడు. మరోవైపు పోలీసులు అతడి ఫోన్‌కాల్‌ లిస్ట్‌ ఆధారంగా పలువురిని విచారించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన ఇద్దరు మహిళలు సైరాబీ, అమ్మాజీలను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం విశాఖకు తరలించారు. అయితే ఇద్దరు మహిళలకు కూడా పోలీసులు తమను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో... ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అమాయకంగా తాము చేసిన నేరమేంటని సిట్‌ అధికారులను వారు ప్రశ్నించారు. పోలీసులు చెప్పిన విషయం తెలిసి షాక్‌ అవ్వడం వారి వంతైంది.

జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఫోన్‌ నుంచి ఓ రోజు  కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన సైరాబీకీ రాంగ్‌కాల్ వెళ్లింది. అది రిసీవ్‌ చేసుకున్న సైరాబీ అతనితో కాసేపు సంభాషించి రాంగ్‌కాల్‌ అని పెట్టేసింది. ఆ తర్వాత కూడా కాల్స్‌ రావడంతో సైరాబీతోపాటు ఆమె అత్త, తోడి కోడలు కాసీంబీ, అమ్మాజీలు కూడా శ్రీనివాసరావుతో మాట్లాడారు. వాస్తవానికి సైరాబీకి ఆ ఫోన్‌ను, సిమ్‌ను పిడుగురాళ్లలో ఉంటున్న తన సోదరుడు రసూల్‌ కొనిచ్చాడు. జగన్‌పై దాడి చేయడానికి ముందు కూడా నిందితుడు శ్రీనివాసరావు సైరాబీ సెల్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో పోలీసులు సిమ్‌కార్డును ఎంక్వైరీ చేసి పిడుగురాళ్లలోని రసూల్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత సెల్‌ను వాడుతున్న సైరాబీని, ఆమె అత్త, తోడికోడలును సిట్‌ పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. తమకేమీ తెలియదని... శ్రీనివాసరావు ఎవరో కూడా తాము చూడలేదని.. రాంగ్‌కాల్‌తోనే శ్రీనివాసరావు పరిచయమని, జగన్‌పై దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో మొరపెట్టుకున్నారు. తాము కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నామని.. ఎవరికీ అపకారం తలపెట్టేవారికి కాదని విలపించారు. 

పోలీసులు శ్రీనివాసరావును విచారించి వారికి దాడితో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. వారి నుంచి వాంగ్మూలం రికార్డు చేసి పంపించారు. దీంతో జగన్‌పై దాడి కేసులో కలకలం సృష్టించిన రాంగ్‌కాల్‌ చిక్కుముడి వీడింది. 

ఒక రాంగ్‌కాల్‌ వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో అర్ధమైంది కదూ. రాంగ్‌కాల్‌ చేసిన శ్రీనివాసరావుతో మాట్లాడటంతో ముగ్గురి కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి. తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఇరుగుపొరుగు నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. అపరిచిత వ్యక్తులు ఎలాంటి వారో తెలుసుకోకుండా వారితో ఒకటికి పలుమార్లు మాట్లాడితే ఇలాంటి చిక్కులే వచ్చిపడతాయి. కాబట్టి రాంగ్‌కాల్స్‌పట్ల అప్రమత్తంగా ఉండండి.

Don't Miss