టీటీడీపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటీషన్

16:57 - October 3, 2018

హైదరాబాద్ : తమిళనాడు కు చెందిన  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఉమ్మడి హైకోర్టులో టీటీడీ పై బుధవారం   పిటీషన్  దాఖలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని, దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ నుంచి తప్పించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. టీటీడీ మీద ఇటీవల కాలంలో  వచ్చిన ఆరోపణలు దేవస్థానం ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయి. 65 ఏళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణను టీటీడీ బోర్డు అమలు చేసింది. దీంతో అప్పటి వరకు ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రమణ దీక్షితులు టీటీడీ మీద  పలు  సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి నగలు, ఆభరణాలు, వజ్రాలు మాయం అయ్యాయంటూ  ఆయన ఆరోపించారు. ఇది అప్పట్లో  పెను దుమారం రేపింది.
           టీటీడీని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం నుంచి తప్పించాలంటూ గతంలో సుబ్రమణ్య స్వామి  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. నిబంధనల ప్రకారమే దేవస్థానం బోర్డు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుందని తెలిపింది. దీనిపై కావాలంటే హైకోర్టుకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో సుబ్రమణ్యస్వామి హైకోర్టు లో  బుధవారం  పిటీషన్ దాఖలు చేశారు. 
గతంలో శ్రీవారి ఆలయంపై పరిశోధన చేసేందుకు పురాతత్వ శాఖకు సహకరించాలంటూ కేంద్రం నుంచి వచ్చిన లేఖ పెనుదుమారం రేపింది. తిరుమల మీద కేంద్రం పెత్తనం చేసేందుకు రాష్ట్రం పరిధి నుంచి తప్పించే కుట్రలు చేస్తోందంటూ టీడీపీ ఆరోపించింది. అయితే, ఆ వివాదం సద్దుమణిగింది.

Don't Miss