పెండింగ్‌ సీట్లపై భారీ ఆశలు పెట్టుకున్న గులాబీ నేతలు

11:29 - November 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌లో పెండింగ్‌ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. త్వరలోనే అన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామన్న అధిష్ఠానం ప్రకటనతో ఆశావహులు తమకే సీటు వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. మరికొంత మందికి అధిష్ఠానం ఇన్‌ డైరెక్ట్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. 

అసెంబ్లీని రద్దు చేసి, 105 మంది అభ్యర్థులను తొలిజాబితాలో ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్‌ఎస్‌. ఈ నేపథ్యంలోనే 50 రోజుల నుండి ప్రజలతో మమేకమవుతూ జోరుగా ప్రచారంలో మునిగిపోయారు అభ్యర్థులు. పెండింగ్‌ ఉన్న 14 స్థానాలపై ఉత్కంఠ నెలకొనగా 2 స్థానాలను ఇప్పటికే ప్రకటించింది అధిష్ఠానం. ఇంకా 12 సీట్లు పెండింగ్‌ ఉండటంతో ఆయా స్థానాలపై గులాబీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు తీవ్రంగా కసరత్తు కూడా చేస్తున్నారు. అయితే గులాబీ దళపతి కొంత మంది అభ్యర్థులకు ప్రచారం ప్రారంభించాలని సైలెంట్‌గా సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 3 లేదా 4 నియోజకవర్గాలకు మించి అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. 

బీజేపీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీరాబాద్‌ నియోజకవర్గానికి టీఆర్ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ పేరు ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన ప్రచారం మొదలు పెట్టేశారు. ఘోషామహల్‌ స్థానానికి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్‌ పేరు దాదాపు ఖరారు అయిందని గులాబీ నేతలు అంటున్నాయి. ఖైరతాబాద్‌ స్థానం నుండి పోటీ చేసేందుకు మాజీ మంత్రి దానం నాగేందర్‌ను సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. దానం కూడా ఇప్పటికే కింది స్థాయి నేతలతో చర్చలు జరుపుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరవుతున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో తీవ్ర పోటీ నెలకొనడంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఎమ్‌ఐఎమ్‌ పార్టీ కూడా మేయర్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థించిందన్న సూచనతో  అంబర్‌పేట రామ్మోహన్‌కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 

మేడ్చల్‌ స్థానానికి ఎంపీ మల్లారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే ఆయన పేరు అధికారికంగా వెల్లడించాల్సి ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వికారాబాద్‌ స్థానం కోసం నలుగురు.. ఐదుగురు టీఆర్‌ఎస్‌ నేతల మధ్య పోటీ నెలకొనడంతో అభ్యర్థిత్వంపై స్పష్టత రాలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎస్సీ సెల్‌ అధ్యక్షులు రవి శంకర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో నేతల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో ఇంకా అభ్యర్థుల ఖరారుపై స్పష్టత రాలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో చివరి నిమిషంలోనే పేర్లు ఖరారు చేసే ఛాన్స్‌ ఉంది. 

Don't Miss