కోఠిలో భారీగా నగదు పట్టివేత

21:39 - October 21, 2018

హైదరాబాద్ : నగరంలో హవాలా వ్యాపారం గుట్టు రట్టు అయింది. కోఠిలో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా నగదు తరలిస్తున్న నలుగురిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.54 కోట్ల నగదును పట్టుకున్నారు. కౌంటింగ్ మిషన్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని గుజరాత్‌కు చెందిన అక్రమ వ్యాపారస్తులుగా పోలీసులు గుర్తించారు. 0.6 శాతం వడ్డీతో నగదును సప్లై చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడించారు.


కోఠిలో ఏపీ09బీఎన్02505 హోండా ఆక్టీవా బైక్‌పై వెళ్తున్న జ్యూలరీస్ బిజినెస్ మేన్ పటేల్ జయేష్, విన్‌రాజ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పాట్‌లో వీరి నుంచి కోటి 80 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లను రుజువు చేయలేకపోయారు.

అయితే వీరిని విచారించగా కోఠిలోని మార్వెల్ మోడల్ ఆఫీస్‌లోని 202 ఫ్లాట్‌లో 74 లక్షల రూపాయలను దాచి పెట్టామని నిందితులు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడి వెళ్లి ఆ నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పటేల్ జయేష్, విన్‌రాజ్‌, పటేల్ అశ్విన్, నవీన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గుజరాత్‌కు చెందిన నగదును అక్రమంగా తరలిస్తున్నారు. పటేల్ జయేష్, విన్‌రాజు హైదరాబాద్ వాస్తవ్యులు. వీరికి పటేల్ అశ్విన్, నవీన్‌లు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం నగరంలో కలకలం సృష్టిస్తోంది. 

 

Don't Miss