టీడీపీ అంతిమ ల‌క్ష్యం అధికారమే… జ‌న‌సేన అంతిమ ల‌క్ష్యం మార్పు

19:46 - November 2, 2018

 తుని: ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు త‌న వ్య‌క్తిగ‌త ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని, రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకోవటం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌-తుని మ‌ధ్య చేసిన రైలు ప్ర‌యాణంలో ఆయన మాట్లాడుతూ.....ముఖ్య‌మంత్రికి అధికార దాహం మిన‌హా, ప్ర‌జాసంక్షేమం ప‌ట్ట‌దని....తెలుగుదేశం పార్టీ కేవ‌లం ఓట్ల రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తోందని ఆరోపించారు. "రాష్ట్రానికి జ‌రిగే అన్యాయం వారికి ప‌ట్ట‌దు. వారికి అధికారం చేతిలో ఉంటే చాలు. ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి. పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి అంటున్నారు, కానీ కేవలం లక్షల కోట్ల అప్పులు మాత్రం మిగులుతున్నాయని" ఆరోపించారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని, బ‌ల‌మైన సంస్థాగ‌త మార్పు తీసుకురావ‌డానికి జ‌న‌సేన పార్టీ కృషి చేస్తుందని, రాజ‌కీయాల్లో జ‌వాబుదారీత‌నం తీసుకురావాల్సిన అవ‌స‌రం  ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలుతీసుకోవటానికి  తాను వ్యతిరేకమని, ప్రజలతో ఉండి వారి కష్టాలు, వారి బాధలు తెలుసుకుంటూ ప్రజలకోసం పనిచేయటం తనకిష్టమని అందుకే సామాన్యుడిలాగా రైలు ప్రయాణం చేసి అందరికష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. "టీడీపీ అంతిమ ల‌క్ష్యం అధికారం అయితే, జ‌న‌సేన పార్టీ అంతిమ ల‌క్ష్యం మార్పు కోసం" అని ఆయన తెలిపారు. గ‌డ‌చిన నెలరోజుల్లో "జ‌న‌బాట కార్య‌క్ర‌మం ద్వారా 23 ల‌క్ష‌ల ఓట్లు ఎన్‌రోల్ చెయ్య‌గ‌లిగాం, ఎక్క‌డో ఒక చోట మార్పు రావాల‌న్న ల‌క్ష్యంతోనే ప్రజల్లోకి వచ్చాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.రాష్ట్రానికి జాతీయ పార్టీలు అన్యాయం చేశాయని 2019 ఎన్నిక‌ల్లో   ప్రజలు ఆకోపాన్ని చూపించ‌బోతున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

Don't Miss