విద్యార్థినిపై హత్యాయత్నం చేసిన టీచర్‌ సస్పెండ్

13:35 - November 3, 2018

కర్నూలు : విద్యార్థినిపై హత్యాయత్నం చేసిన టీచర్‌ శంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిపై దాడి చేసిన శంకర్‌ను సస్పెండ్ చేయాలని స్కూల్ యాజమాన్యానికి మంత్రి గంటా శ్రీనివాస్ అదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరపాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో శంకర్‌ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది.

కర్నూలు జిల్లాలోని రాక్డ్ స్కూల్ లో హిందీ టీచర్ గా శంకర్ పనిచేస్తున్నారు. అదే స్కూల్లో ఓ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. శనివారం ఉదయం ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లిన శంకర్ బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన అనంతరం అదే బ్లేడ్ తో శంకర్ కూడా గొంతు కోసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని గొంతు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినిపై దాడి చేసిన సమయంలో శంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ప్రజలు శంకర్‌ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Don't Miss