డిసెంబర్ 7న పోలింగ్ : ఏర్పాట్లు ముమ్మరం

18:27 - December 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నక్సల్స్ సమస్య ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. 2018, డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం సరిగ్గా 5 గంటలకు  ప్రచారం ముగించాయి పార్టీలు. మైకులు కట్ అయ్యాయి. నోటికి తాళం పడింది. ప్రచార రథాలకు బ్రేక్ పడింది.
ఎక్కడి వారు అక్కడ గప్ చుప్.. 
సభలు, సమావేశాలు, రోడ్డు షోల్లో ఉన్న నేతలు ఎక్కడి వారు అక్కడ గప్ చుప్ అయ్యారు. ప్రెస్ మీట్లలోని నేతలు టైం చూసుకుని మరీ మాట్లాడారు. 5 గంటలు కాగానే నోటికి తాళం వేశారు. ప్రసంగాలు ఆగిపోయాయి. డిసెంబర్ 7వ తేదీ శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 119 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ అంతటా ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఈనెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు..
ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బరిలో 1821 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం  2,80, 64, 684 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పాల్గోననున్నారు. ఓటరు, పోలింగ్ బూత్ సమాచారం కోసం నా ఓటు యాప్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 

 • ఎన్నికల బరిలో ఒక వెయ్యి 821 మంది అభ్యర్థులు ఉన్నారు. 
 • మల్కాజ్ గిరి నుంచి అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
 • బాన్సువాడ నుంచి బరిలో కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు.
 • రాష్ట్రంలో  ఓటర్లు 2 కోట్లు 80లక్షల 64వేల 684 మంది ఉన్నారు.
 • పురుష ఓటర్లు కోటి 41 లక్షల 56 వేల 182 మంది
 • మహిళా ఓటర్లు కోటి 39 లక్షల 5 వేల 811 మంది. 
 • థర్డ్ జండర్ ఓటర్లు 2,691 మంది.
 • మొత్తం 32వేల 815 పోలింగ్ కేంద్రాలు
 • అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 3వేల 873 పోలింగ్ కేంద్రాలు
 • వనపర్తి జిల్లాలో కేవలం 280 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.
 • శేరిలింగంపల్లిలో అత్యధికంగా పోలింగ్ బూత్ లు ఉన్నాయి.
 • 55వేల 329 ఈవీఎంలు, 42వేల 751 వీవీ ప్యాట్ సిద్ధం చేశారు. 
 • ఓటు, పోలింగ్ బూత్ సమాచారం కోసం ’నా ఓటు యాప్’ అందుబాటులో ఉంది 
 • దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, బ్రెయిలీ లిపిలో ఎపిక్ కార్డ్స్. 
 • దివ్యాంగులకు ప్రత్యేక రవాణా సదుపాయం 
 • 279 కేంద్ర కంపెనీ బలగాలు, 5 రాష్ట్రాల నుంచి 18వేల 860 మంది సిబ్బంది.. 30 వేల మంది రాష్ట్ర భద్రతా సిబ్బంది పోలింగ్ రోజు శాంతిభద్రతలను సమీక్షించనున్నారు.
 • ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.
 • 80 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Don't Miss