విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ ప్రథమస్థానం

12:21 - November 3, 2018

హైదరాబాద్ : ప్రగతి సూచికలుగా గుర్తించే విద్యుత్‌ వినియోగం, తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిశాతం నమోదు చేయడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు విభాగాల్లోనూ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలవడంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసింది. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా వినియోగంలో తెలంగాణలో 13.62శాతం వృద్ధి సాధించింది. అంతేకాదు.. తలసరి విద్యుత్‌ వినియోగం  11.34శాతం పెరిగింది. ఈ రెండు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికే ప్రథమ స్థానం దక్కింది. ఇక గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌లో తెలంగాణ రాష్ట్రం 11.94శాతం వృద్ధి సాధించింది. 2017-18 వార్షిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను  కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ వినియోగంలో మొదటి స్థానం సాధించింది. ఏడాదికి సగటున రాష్ట్రంలో 97వేల వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతున్నట్టు స్పష్టమైంది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ మరింత వృద్ధి సాధించనున్నట్టు సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.

విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలవడంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేవలం నాలుగేళ్ల అతి తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం చిమ్మచీకట్ల నుంచి నిత్య వెలుగుల రాష్ట్రంగా మారిందన్నారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయడంతోపాటు అన్ని రంగాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.  రాష్ట్ర విద్యుత్‌ వినియోగం, తలసరి విద్యుత్‌ వినియోగంలో అత్యధిక వృద్ధిరేటు తెలంగాణ పురోగమనాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన ప్రణాళిక, చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ వల్ల విద్యుత్‌ సంస్థలు ఈ విజయం సాధించగలిగాయని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గ సరఫరా చేస్తూనే... రాబోయే కాలంలో వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ రంగం సాధిస్తున్న విప్లవాత్మక విజయాలు రాష్ట్రంలోని అన్ని రంగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంలోనూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడడంలోనూ నాణ్యమైన , నిరంతరాయ విద్యుత్‌ సరఫరా  పాత్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Don't Miss