సహకరించిన అందరికీ ధన్యవాదాలు

17:09 - December 7, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి అని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.  పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ లో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.  సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను పోలింగ్ బూత్ లనుంచి స్ట్రాంగ్ రూంలకు తరలిస్తాం అని డీజీపీ మహేందర్రెడ్డి చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్ర సాయుధ బలగాలు ఈవీఎంల వద్ద కాపలాగా ఏర్పాటు చేశామని డీజీపీ చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ....... ఓట్ల లెక్కింపు జరిగేంత వరకు  స్ట్ర్రాంగ్ రూంల వద్ద సీసీటీవీ కెమెరాలతో 24 గంటలు  నిఘా పర్యవేక్షణ  కొనసాగుతుందని ఆయన తెలిపారు. గత 3 నెలలుగా పోలీసు సిబ్బంది  ఎన్నికల విషయంలో అహర్నిశలు కష్టపడి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చేశారని డీజీపీ చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగటం కేవలం టీమ్ వర్క్ వల్లే సాధ్యమయ్యిందని పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజలతో మమేకమై ఎన్నికలు నిర్వహించాము కనుక సహకరించిన పౌరులకు కూడా ధన్యవాదాలు అని డీజీపీ చెప్పారు.  రాష్ట్ర పోలీసుశాఖకు ప్రతి విషయలోనూ సరైన సూచనలిచ్చిన ఎన్నికల సంఘానికి కూడా మహేందర్రెడ్డి  ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అని మహేందర్ రెడ్డి అన్నారు. 11 వ తేదీ ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. 

 

Don't Miss