జీవితంలో దేనికీ పనికిరాము అని ఎవరూ అనుకోకూడదు - ఎఆర్ రెహ్మాన్

09:07 - November 5, 2018

ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ జీవితచరిత్ర ఆధారంగా కృష్ణ త్రిలోక్ రాసిన బయోగ్రఫీ ‘నోట్స్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహ్మాన్‌’ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న పలు ఆసక్తికర విషయాలను, అనుభవాలను తెలియజేశారు. తనకు పాతికేళ్ల వయసు వచ్చేవరకూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేవని చెప్పారు. కంపోజర్‌గా కెరీర్ ప్రారంభించిన తాను అప్పట్లో ఫెయిల్ అయ్యాయని అన్నారు. దీనికి తోడు కుటుంబ బాధ్యతలు.. 9ఏళ్ల వయసులోనే తండ్రి మరణం.. ఎన్నో కష్టాలు.. వీటిని ఎదుర్కొలేక తన జీవితం ఇక ముగించాలని భావించేవాడినని తెలిపారు. అయితే చావు అనేది పరిష్కారం కాదని అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని 25ఏళ్ల వయసులో తెలుసుకున్నట్లు రెహ్మాన్ చెప్పారు.  జీవితంలో ఎవరూ పనికిరారు అని అనుకోకూడదని.. రెహ్మాన్ సూచించారు. చావు అనేది అందరికీ ఒకేసారి వస్తుందని, ప్రతిదానికి అంతమయ్యే తేదీ ఉంటుందని చెప్పుకొచ్చారు.  

12 నుంచి 22 ఏళ్ల వయసులోనే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి, ఎంతో నేర్చుకున్నట్టు రెహ్మాన్ తెలిపారు. ఏదైనా కొత్తగా చేయాలనుకున్న తాను చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారిపోయానని చెప్పారు. తన అసలు పేరు దిలీప్ అని, రోజా సినిమాకు సంగీతం అందించే సమయంలో తన కుటుంబం ఇస్లాం మతంలోకి మారడంతో తన పేరు రెహ్మాన్‌గా మారిందని వివరించారు. ఎందుకు ఇష్టంలేదో తెలియదు కానీ అసలు దిలీప్ అనే పేరు తనకు నచ్చేది కాదన్నారు. సంగీతమే తనలో మార్పు తెచ్చిందని రెహ్మాన్ వెల్లడించారు. మొత్తంగా తాను ఎదుర్కొన్న కష్టాలే తనను జీవితంలో మరింత రాటుదేలేలా చేశాయని రెహ్మాన్ పేర్కొన్నారు.

Don't Miss