48 గంటల్లో 13లక్షలు విలువైన లడ్డూలు మాయం

09:47 - November 6, 2018

తిరుమల: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం చెలరేగింది. తిరుమలలో శ్రీవారి లడ్డూల కుంభకోణం బయటపడింది. లడ్డూ కౌంటర్‌లలో పని చేసే కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం చూపించారు. రెండు రోజుల వ్యవధిలో 26వేల లడ్డూలను కాంట్రాక్ట్ సిబ్బంది పక్కదారి పట్టించినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పక్కదారి పట్టించిన లడ్డూల విలువ రూ.13లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 30మంది అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. లడ్డూల స్కాంలో టీటీడీ ఉద్యోగుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

* తిరుమలలో లడ్డూల కుంభకోణం
* 2 రోజుల్లో 26వేల లడ్డూలు పక్కదారి
* 13లక్షలు విలువైన లడ్డూలు మాయం
* రూ.50 విలువైన లడ్డూలు రూ.80, 100కు విక్రయం

గత నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ రోజున రద్దీ అధికంగా ఉంటుందని, భక్తులకు ఆలస్యం కాకుండా లడ్డూ టోకెన్లను స్కాన్ చేయకుండానే భక్తులకు త్వరితగతిన అందజేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను లడ్డూ కౌంటర్‌లలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా చేసుకున్నారు. లడ్డూలను పక్కదారి పట్టించి వాటిని బ్లాక్‌లో విక్రయించుకున్నారు. 50రూపాయలు విలువైన లడ్డూని బ్లాక్‌లో 80, 100 రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కాస్త ఆలస్యంగా ఈ స్కాం వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో అక్రమానికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

Image result for tirumala laddu scamగతంలో కూడా ఇలాగే అనేక స్కామ్‌లు జరిగినా సరైన చర్యలు తీసుకోవడంలో టీటీడీ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సేవా టికెట్లు, లడ్డూలు అడ్డదారిలో పొందడం బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం సాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

 

Don't Miss