నేడే భారత్‌-విండీస్‌ తొలి టీ20

10:10 - November 4, 2018

ఢిల్లీ : వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ మరో సమరానికి సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా.. కరీబియన్‌ జట్టును ఢీకొంటుంది. అయితే టీ20లకు చిరునామా అయిన ధోని లేకుండానే భారత్‌ బరిలో దిగుతోంది. అంతేకాదు కెప్టెన్‌ కోహ్లికి కూడా విశ్రాంతినివ్వడంతో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే టీమ్‌ఇండియా.. విండీస్‌తో పోరుకు సై అంటోంది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టును రోహిత్‌శర్మ నడిపించనున్నాడు. ధోని, కోహ్లి లేని నేపథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపించడం రోహిత్‌కు సవాలే. ధోని లేకపోవడంతో తనను తాను నిరూపించుకునేందుకు రిషబ్‌ పంత్‌కు ఇదే సరైన అవకాశం. మరోవైపు స్టార్‌ ఆటగాళ్లు వచ్చి చేరడంతో వెస్టిండీస్‌ బలోపేతమైంది. కెప్టెన్‌ హోల్డర్‌ స్థానంలో జట్టు బాధ్యతలు చేపట్టిన కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ప్రమాదకర ఆటగాడు. డారెన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌, రామ్‌దిన్‌ లాంటి అనుభవజ్ఞులు జట్టులో చేరడంతో హోరాహోరీ పోరు జరగడం మాత్రం పక్కా.

Don't Miss