ఏటీఎంలో చిరిగిన నోట్లు.. ల‌బోదిబోమంటున్న వినియోగ‌దారులు

19:37 - October 5, 2018

విశాఖ: అరిలోవ బాలాజీన‌గ‌ర్ లోని స్థానికులు పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింది. 2వేల రూపాయ‌ల నోట్లు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. 2వేల రూపాయ‌ల నోటుని చూసి వారు షాక్ అవుతున్నారు. దీనికి కార‌ణం ఏంటంటే.. ఆ నోట్లు చిరిగిపోయి ఉండ‌ట‌మే. బాలాజీన‌గ‌ర్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో రెండు రోజులుగా చిరిగిన రూ.2వేల నోట్లు వ‌స్తున్నాయి. దీంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. 

ఇలా ఒక‌రికో ఇద్ద‌రికో కాదు.. సుమారు 10మంది ఖాతాదారుల‌కు ఈ అనుభ‌వం ఎదురైంది. వారంద‌రూ వెంకోజీపాలెంలోని బ్యాంకు మేనేజ‌ర్ కు ఫిర్యాదు చేశారు. అయితే న‌గ‌దును తాము డిపాజిట్ చేయ‌డం లేద‌ని, ఏజెన్సీకి అప్ప‌గించామ‌ని, బ్యాంకు మేనేజ‌ర్ స్ప‌ష్టం చేసి త‌మ త‌ప్పేమీ లేద‌న్న‌ట్టు చేతులు దులుపుకున్నారు. కానీ ఏజెన్సీ వాళ్లు మాత్రం మ‌రో వెర్ష‌న్ వినిపిస్తున్నారు. బ్యాంకు ఇచ్చిన నోట్ల‌నే తాము మెషీన్ల‌లో పెడ‌తామ‌ని.. ఇందులో మా త‌ప్పు కూడా ఏమీ లేద‌ని బ‌దులిస్తున్నారు. దీంతో క‌స్ట‌మ‌ర్లు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. అటు బ్యాంకు సిబ్బంది, ఇటు ఏజెన్సీ వాళ్లు.. ఇద్ద‌రూ త‌ప్పించుకోవ‌డంతో వినియోగ‌దారులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య ఎవ‌రికి చెప్పాలి మ‌హాప్ర‌భో..? అని ఆవేద‌న చెందుతున్నారు. 

Don't Miss