నేడు నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

11:52 - October 3, 2018

నిజామాబాద్ : టీఆర్ఎస్ బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లా ముస్తాబయ్యింది. ఇందూరు నగరం గులాబీమయంగా మారింది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో ఉన్న గులాబీ దళపతి మరోసారి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. హుస్నాబాద్ సభతో ఎన్నికల ప్రచార శంఖాన్ని పూరించిన టీఆరెస్ అధినేత కేసీఆర్.. నిజామాబాద్ నుంచి పూర్తి స్ధాయి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నిజామాబాద్‌లోని  గిరిరాజ్ కాలేజిలో ఇవాళ భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లుపూర్తి చేశారు. పార్టీ మలి సభ కావడంతో ఇందూరు గులాబీ మయంగా మారింది.

సభా స్ధలి వద్దే హెలిప్యాడ్ ను సిద్దం చేశారు. వేదిక, ఇతర నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సుమారు 100 మంది నేతలు వేదికపై కూర్చునేలా నిర్మాణం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే నేతలు, జిల్లా మంత్రి,  ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలంతా కూర్చునేలా వేదికను సిద్దం చేస్తున్నారు. పార్కింగ్ కోసం సీఎస్ఐ గ్రౌండ్‌తోపాటు పాలిటెక్నిక్ కళాశాల మైదానం, సభ ఎదురుగా ఉన్న ఖాళీ స్ధలాన్ని వినియోగిస్తున్నారు. సభ దగ్గర మూడంచల భద్రత ఏర్పాట్లు చేశారు. 

జిల్లాలోని 9 నియోజకవర్గాల నుంచి సభకు భారీ జనసమీకరణ చేస్తున్నారు. అధినేత దృష్టిని ఆకర్షించేలా తాజా మాజీలు జనసమీకరణలో పోటీ పడుతున్నారు. గ్రామాల్లోనే వాహనాలను సిద్దం చేశారు.  . ఇప్పటికే నగరాన్ని గులాబీమయంగా మార్చిన గులాబి దండు.. దళపతికి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. 

వారం రోజులుగా జిల్లాలోనే మకాం వేసిన ఎంపీ కవిత.. తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  భారీ జనసమీకరణ కోసం కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ఆశీర్వదించేందుకు రావాలని ఆహ్వానం పలుకుతున్నారు. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కవిత చెప్పారు. హుస్నాబాద్ సభ అనంతరం పార్టీ అధినేత హోదాలో కేసీఆర్ పూర్తిస్ధాయి ప్రచారం నిజామాబాద్ నుంచే ప్రారంభించనున్నారు. తాజా రాజకీయ పరిణాణాలతో పాటు ఎన్నికల హామీలు తదితర అంశాలపై కేసీఆర్‌ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

Don't Miss