ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం

17:39 - October 9, 2018

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్దానం పాలకమండలి సమావేశం ముగిసింది. మూడేళ్లు కు పైగా తిరుమలలో పనిచేస్తున్నవారిని  వేరే  చోటకు  బదిలీ చేయాలని  ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశం లో నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన మంగళవారం  సమావేశమైన  బోర్డు  టీటీడీ లో  పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులకు  డెప్యుటేషన్  పై  పరకామణి లో  డ్యూటీ వేయరాదని, టీటీడీ లోని రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు  6 మంది సభ్యులతో  ఒక కమిటీ ఏర్పాటు చేయాలని  నిర్ణయించింది. అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120 కోట్లతో దాదాపు 500 గదులతో వసతి సముదాయం నిర్మించేందుకు  బోర్డు  ఆమోదం తెలిపింది. డిప్యూటేషన్ పై    టీటీడీలోకి వచ్చిన  ఉద్యోగులను 3 ఏళ్ళ తర్వాత తిరిగి మాతృసంస్ధకు పంపాలని నిర్ణయించారు. ఒకేచోట మూడు సంవత్సరాలు విధులు నిర్వహించిన టీటీడీ  ఉద్యోగులను మరో చోటకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  కాలేజీల్లో  డిమాండ్   ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచి,  డిమాండ్ తక్కువ ఉన్నగ్రూపులలో సీట్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.  తిరుమల లోని  కాటేజీల ఆధునీకరణకు  రూ.112 కోట్లు  మంజూరు చేసిన బోర్డు,  ఏపీ రాజధాని  అమరావతిలో నిర్మిస్తున్న  శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్లకు  ఆమోదం తెలిపింది. 

 

Don't Miss