‘మీ టూ’ ఉచ్చులో కేంద్ర మంత్రి, మాజీ జర్నలిస్టు ఎమ్‌ జే అక్బర్

16:30 - October 9, 2018

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, మాజీ ఎడిటర్ ఎమ్ జే అక్భర్ ‘#మీ టూ’ సుడిగుండంలో చిక్కుకున్నారు. తనుశ్రీ దత్తా- నానా పటేకర్‌తో మొదలైన ‘మీ టూ’ ప్రచారం సినీ రంగంతోపాటు మీడియా హౌజ్‌లను కబళిస్తోంది. హిందూస్థాన్ టైమ్స్ ఎడిటర్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రికే ఈ ప్రచారం ఎసరుపెట్టింది. 
దీనిపై విలేకరులు ప్రశ్నించగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘మీరు మహిళా మంత్రిగా ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మీరేమైనా వీటిపై విచారణకు ఆదేశిస్తారా’’ అని  ట్రిబ్యూన్ ప్రతినిధి స్మితా శర్మ.. సుష్మా స్వరాజ్‌ను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వడివడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.  దీనిపై స్పందించడానికి మంత్రి అక్బర్ అందుబాటులో లేరు. ఆయన నైజీరియా పర్యటనలో ఉన్నట్టుగా సమాచారం.  
ప్రియా రమణి అనే జర్నలిస్టు తన ట్వీట్‌లో ప్రముఖ జర్నలిస్టు కేంద్ర విదేశీ ఉప మంత్రి అక్బర్ పేరును వెల్లడించింది. అమెరికాలో ఈ తరహా ప్రచారం హార్వే వీన్‌స్టీన్ కుంభకోణం వెలుగుచూసినపుడు రమణి తన చేదు అనుభవాలను వెల్లడించింది.  ఆ వ్యక్తినే ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్‌గా పేర్కొంది. తనపై వేధింపులపై ఒక  మ్యాగజైన్‌లో ఓ ఆర్టికల్‌ను గత ఏడాది అక్టోబర్‌లో ఆమె రాసింది. 

 

Don't Miss