మాతో చేతులు క‌ల‌పండి- ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వి.హ‌నుమంత‌రావు విజ్ఞ‌ప్తి

14:03 - October 7, 2018

హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తేదీలు ఖ‌రారు కావ‌డంతో అన్ని పార్టీలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ప్ర‌చార‌ప‌ర్వాన్ని ప‌రుగులు పెట్టించేందుకు సిద్ధమ‌వుతున్నాయి. ఈ విష‌యంలో టీఆర్ఎస్ ముందుండ‌గా.. ప్ర‌తిపక్షాలు ఇంకా పొత్తులు, చ‌ర్చ‌ల వ‌ద్దే ఆగిపోయాయి. టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్షాలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌మ మ‌హాకూట‌మిలోకి ఇత‌ర పార్టీలు కూడా రావాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆశిస్తున్నారు. తాజాగా టీ పీపీసీ ఎన్నిక‌ల వ్యూహ క‌మిటీ చైర్మ‌న్, ఏఐసీసీ కార్య‌ద‌ర్శి వి.హ‌నుమంత‌రావు జ‌న‌సేన గురించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన మ‌హాకూట‌మిలోకి వ‌స్తే ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. జ‌న‌సేన సొంతంగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయ‌ని వీహెచ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించ‌డానికి ప‌వ‌న్ మ‌హాకూట‌మిలోకి రావాల‌ని వీహెచ్ కోరారు. ప్రజాస్వామ్యంలో విలువ‌లు లేకుండా పోతున్నాయని ప‌వ‌న్ పార్టీ పెట్టారని వీహెచ్ గుర్తు చేశారు. కాగా తెలంగాణ‌లో 25సీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని... అయితే తెలంగాణ‌లో దొర‌ల పాల‌న‌కు తెర‌దించేందుకు విప‌క్షాల‌న్నీ ఏక‌మైన వేళ‌.. ప‌వ‌న్ ఇక్క‌డ పోటీ చేసి ఓట్లు డివైడ్ చేయ‌డం మంచి సంప్ర‌దాయం కాదని వీహెచ్ హిత‌వు ప‌లికారు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసి ఓట్లు చీల్చి ప్ర‌జాస్వామ్యాన్ని అవినీతిప‌రుల‌కు ఇవ్వొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ కూడా మ‌హాకూట‌మిలో క‌ల‌వాల‌ని వీహెచ్ కోరారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింద‌ని..ఇందిరా విజ‌యర‌థం పేరుతో తాను ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వీహెచ్ వెల్ల‌డించారు.

Don't Miss