గోదావరిలో భార్యలకు పిండ ప్రదానం చేసిన భర్తలు

11:54 - October 8, 2018

ముంబై: అవును.. భార్య‌లు బ‌తికుండ‌గానే భ‌ర్తలు పిండ ప్ర‌దానం చేశారు. భర్తలకు భార్యలు విముక్తి కల్పిస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారట‌. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయని, చివరికి అవి విడాకులకు దారి తీస్తున్నాయని వారు వాపోయారు. మహారాష్ట్రలోని నాసిక్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందమంది భార్యాబాధితులు వేదమంత్రోచ్చారణ మధ్య గోదావరిలో తర్పణాలు విడిచారు. వాస్తవ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అమిత్ దేశ్‌పాండే దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు.

పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయని, చివరికి అవి విడాకులకు దారి తీస్తున్నాయని అమిత్ దేశ్ పాండే పేర్కొన్నారు. ఇటువంటి వ్యవహారాల్లో మహిళలకే ఎక్కువగా మద్దతు లభిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో భర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే వాస్తవ్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసినట్టు అమిత్ తెలిపారు. గతంలో వారణాసిలోనూ పిండ ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అమిత్ వివరించారు. భార్యలు కేసులు వేసినప్పుడు భర్తలకు ధైర్యం చెప్పడంతో పాటు న్యాయపరమైన సాయం కల్పిస్తున్నారు.  

గ‌తంలో వార‌ణాసిలోనూ ఇలానే జ‌రిగింది. భార్యల వల్ల బాధలు పడ్డ భర్తలు వైవాహిక జీవితానికి ముగింపు పలికి.. తమ మాజీ భార్యల పేరిట ‘పిశాచి ముక్తి పూజ’ను వారణాసిలోని గంగానది వద్ద నిర్వహించారు. ఇలా చేస్తే.. భార్యల వల్ల పడిన బాధలకు స్వస్తి పలికి.. పీడ వదిలిపోతుందని వారు చెబుతున్నారు. అంతేకాదు, తమ మాజీ భార్యలకు శాస్త్రోక్తంగా హిందూ ధర్మం ప్రకారం పిండ ప్రదానం చేశారు.
 
భారతీయ చట్టాలన్నీ పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని భ‌ర్త‌లు వాపోతున్నారు. చివరికి జంతువులకు కూడా ఓ మంత్రిత్వ శాఖ ఉందని.. పురుషుల భద్రత కోసం ఏ శాఖ లేదని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం భార్యలు పెట్టే బాధలు భరించలేక 92వేల‌ మంది భర్తలు చనిపోతున్నారని, భర్తలు పెట్టే హింసలు భరించలేక 24వేల‌ మంది భార్యలు చనిపోతున్నారని సంస్థ స‌భ్యులు చెప్ప‌డం విశేషం.

Don't Miss