వైర‌ల్ గా మారిన అమ్మాయి ఫొటో గురించి స్పందించిన విజ‌య్

19:27 - October 5, 2018

విజ‌య్ దేవ‌ర‌కొండ‌. టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో విజ‌య్ క్రేజ్ కొండంత పెరిగింది. గీత గోవిందం సినిమాతో ఆ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడు నోటా సినిమాతో మ‌రో సంచ‌ల‌నం సృష్టించాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి వరుస హిట్లతో విజయ్ దేవరకొండ కెరీర్ టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన ‘నోటా’ సినిమాతో విజయ్ తమిళంలో కూడా అడుగుపెట్టిన‌ట్టైంది. ఈ సంద‌ర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడాడు. పలు అంశాలపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత తనకు భారీగా క్రేజ్ వచ్చిందని విజయ్ తెలిపాడు.

ఇక ఇటీవల ఓ విదేశీ యువతితో విజ‌య్ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆ యువ‌తి డిన్నర్ చేస్తున్న ఫొటో హాట్ టాపిక్ అయింది. విజ‌య్ తో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రు? అని ఫ్యాన్స్ తీవ్రంగా చ‌ర్చించుకున్నారు. తాజాగా ఆ విష‌య‌మై విజ‌య్ స్పందించాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి చాలా మంచిదని విజయ్ కితాబిచ్చాడు. ఇక మిగిలిన విషయాలను మరిచిపోవాలని నవ్వుతూ జవాబిచ్చాడు. బెల్జియం దేశానికి చెందిన యువతితో విజయ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ యువ‌తి గురించి పెద్ద‌గా వివ‌రాలేవి చెప్ప‌కుండా విజ‌య్ మ‌రోసారి ఎస్కేప్ అయ్యాడు.

తన పేరును ఇంగ్లిష్‌లో అనువదించి ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ అని సొంత ప్రొడక్షన్ సంస్థకు పేరు పెట్టినట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఎవరైనా మంచి స్క్రిప్టుని తీసుకొస్తే వాళ్లని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ పెట్టినట్లు వెల్లడించాడు. తనకు కథపైనా, వ్యక్తులపైనా నమ్మకం కుదిరితేనే సినిమాను చేస్తానని దేవరకొండ స్పష్టం చేశాడు.

ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్ గురించి ఆలోచించేందుకు సమయమే లేదని విజ‌య్ చెప్పాడు. ఓ సినిమా తర్వాత మరో సినిమాను చేస్తూ తాను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని తెలిపాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత  యాక్టింగ్ మానేసి దర్శకత్వం-రచన వైపు వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు. కానీ అంతలోనే వరుస సినిమా అవకాశాలు వచ్చాయన్నాడు. ప్రస్తుతం దక్కిన గుర్తింపు, క్రేజ్ తో తాను ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

Don't Miss