బంగారం షాపులపై తూనికలు, కొలతలశాఖ తనిఖీలు, కేసులు నమోదు

19:34 - November 3, 2018

హైదరాబాద్: "డబ్బులు ఎవరికీ ఊరికే రావు, ఇంతవరకు ఇచ్చింది చాలు" అంటూ కొన్నిరోజులక్రి తం టీవీల్లో ప్రకటనలు చూసి జనం బంగారం షాపులకు  క్యూ కట్టారు. అక్షయ తృతీయ, ధన్ తేరస్ పేరు చెప్పి బంగారం షాపులు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. సంవత్సరంలో వచ్చే ఈరెండు రోజుల్లో బంగారం కొనాలనుకునేవారి బలహీనతలతో బంగారం షాపులు కిటకిట లాడతాయి. ఇదే అదనుగా బంగారం షాపులు వినియోగదారులను రకరకాల మోసాలతో నిండా ముంచుతున్నాయి.  దీపావళికి 2 రోజులు  ముందు బంపర్ ఆఫర్లు ప్రకటించి తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ఇక్కడే వినియోగదారుడు నిండా మునుగుతున్నాడు.  ఈసమయంలో వ్యాపారస్తులు  వినియోగదారులను మోసంచేసే అవకాశం ఉండటంతో  తూనికలు కొలతలశాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌... తన సిబ్బందితో 9 బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ లోశనివారం విస్తుృతంగా  తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వినియోగదారులును  మోసంచేస్తున్న 85 షాపులపై కేసులు నమోదుచేశారు. 
ఈరోజు తూనికలు కొలతల శాఖ తనిఖీల్లో అనేక అక్రమాలు  బయటపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలోతొక్కి వినియోగదారుడిని బంగారం వ్యాపారస్తులు నిలువునా  దోచుకుంటున్నాయి.  నిబంధనల ప్రకారం... వినియోగదారులు కొనుగోలు చేసిన నగలకు ఇచ్చే బిల్లులో కచ్చితంగా బంగారం నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్‌ బరువు, ధర విడివిడిగా బిల్లులో చూపించాలి. కొనుగోలు చేసిన రోజు ఉన్న బంగారం ధరతోపాటు 22 కేరట్లా, 24 కేరట్లా అన్నది స్పష్టంగా  తెలపాలి. మేకింగ్‌ చార్జీలు , వేస్టేజ్‌ని వ్యాట్‌లో కలపడం కూడా నిబంధనలకు విరుద్ధం. అన్నీపోగా నికర బరువు ప్రకారమే ధర వేయాలి. కానీ...వ్యాపారస్తులు వేస్టేజ్‌ పేరుతో, రాళ్లబరువుతో కలిపి చార్జి చేస్తు వినియోగదారుడిని  మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.  
తూనికలు కొలతలు శాఖ తనిఖీల్లో నగరంలోని పలు పేరెన్నికగన్న షాపులు ఉండటం గమనార్హం. అందులో కొన్ని .....తిబుర్‌మల్‌, మంగత్‌రాయ్‌, ముసద్దీలాల్‌ జువెలర్స్‌ (బంజారాహిల్స్‌), మహాలక్ష్మి జువెలర్స్‌(జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌), తనిష్క్(రోడ్‌ నెం.1 బంజారాహిల్స్‌), లలిత, ముసద్దీలాల్‌, మలబార్‌ గోల్డ్‌, కీర్తిలాల్‌ జువెలర్స్‌ (సోమాజిగూడ),  భజరంగ్‌లాల్‌ జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌ , సూరజ్‌భాన్‌ అండ్‌ కంపెనీ, తోతారామ్‌ సాగర్‌లాల్‌,  వైభవ్‌, శుభం జువెలర్స్‌ (తార్నాక), కుమరన్‌, సీఎంఆర్‌, చందన, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌, తోతారామ్‌ సాగర్‌లాల్‌, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌, సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌, చెన్నై షాపింగ్‌మాల్‌(ఆర్‌పీ రోడ్‌) లు ఉన్నాయి.

Don't Miss