రాజస్ధాన్ లో తదుపరి అధికారం ఎవరిది?

20:20 - October 7, 2018

రాజకీయ చర్చకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వాటిలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ కాంగ్రెస్ కి చాలా కీలకమైనవి.  ఎందుకంటే ఇక్కడ ఆపార్టీ అధికారానికి దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ లలో  ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా  వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా రాజస్తాన్ విషయమే చూస్తే, ఆరునెలల క్రితం జరిగిన బై ఎలక్షన్స్‌లో రెండు ఎంపీ స్థానాలు ఓ ఎమ్మెల్యే సీటులో కాంగ్రెస్పార్టీ ఘన విజయం సాధించింది. మరోవైపు ముఖ్యమంత్రి వసుంధరాజె మళ్లీ  అధికార  పీఠం తనదే అఁటున్నారు. ఇంతకీ ఈ రెండు పార్టీల బలాబలాలు రాజస్ధాన్లో ఎలా ఉన్నాయ్, ఎవరి సత్తా ఎంత అనేది ఒకసారి  చూద్దాం.
200 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న రాజస్ధాన్ లో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో  ఎక్కువకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1990 నుంచి  బిజెపి  అధికారం  చేజిక్కుంచుకుంటూ  వస్తోంది.  1998 నుంచి ఇక్కడ ప్రతి 5 ఏళ్లకు ఓసారి  పార్టీ అధికారంలోకి వస్తోంది. 2013లో జరిగిన ఎన్నికలలో 45.50 శాతం ఓట్లతో బిజెపి విజయ దుంధుభి మోగించింది. 160 అసెంబ్లీ సీట్లు గెలిచింది. ఆ తర్వాత 2014 మే లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 55.1శాతం ఓట్లతో మొత్తానికి మొత్తం ఎంపీ సీట్లు అంటే, 25 నియోజకవర్గాలను గెలుచుకుంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. ఐతే ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయ్. కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్‌ ముందుండి పోరాటం సాగించారు.ఓటర్లు కూడా ఐదేళ్లకోసారి ఇక్కడ పార్టీలను మార్చేస్తున్నారు, ఇది కూడా  కాంగ్రెస్ కు ఆశాదీపంలా కనిపిస్తోంది. బిజెపిలోని  లుకలుకలు ఆ పార్టీని బలహీనపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళలో బిజెపికి సీనియర్ పొలిటీషియన్ ఘన్ శ్యామ్ తివారీ  ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. విద్యాశాఖామంత్రిగా పని చేసిన శ్యామ్ తివారీ పార్టీలో 30ఏళ్లుగా పనిచేశారు.సిఎం వసుంధర రాజెతో విబేధాలతోనే ఆయన పార్టీని వీడినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఈయన కుమారుడు అఖిలేష్ తివారీ సొంతంగా భారత్ వాహిని పేరుతో కొత్త పార్టీ పెట్టాడు. 200 సీట్లలో అభ్యర్ధులను దింపుతామంటూ ప్రకటించారు. ఘన్ శ్యామ్ తివారీ రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ మెజార్టీ సాధించిన నేతగా రికార్డు ఉంది. అలాంటిది ఈయన పార్టీ మారితే ఖచ్చితంగా వచ్చే బిజెపి విజయావకాశాలను దెబ్బతీస్తారని అంటున్నారు
మరోవైపు కాంగ్రెస్ విషయమే చూస్తే, ఈ మధ్య జరిగిన రాష్ట్రాల ఎన్నికలలో ఎక్కడాలేని సానుకూలత ఇక్కడ కన్పిస్తుందని ఆ పార్టీనేతలు చెప్తున్నారు. ప్రస్తుతం  రద్దైన శాసనసభలో కాంగ్రెస్ కి 25 స్థానాలు ఉన్నాయి. 1998 నుంచి అధికారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారుతుందనే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందనే ధీమా కన్పిస్తుంది వారి మాటల్లో. దీనికి తోడు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం తమకి అడ్వాంటేజ్‌గా మారుతుందని ఆ పార్టీ నేతల అంచనా వేస్తున్నారు. 
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ మండ్ గఢ్ అసెంబ్లీ సీటు గెలిచింది. అజ్మీర్, అల్వార్ లోక్సభ సీట్లనూ కైవసం చేసుకుంది. ఈ మూడు సీట్లూ బిజెపివే కావడం విశేషంగా చెప్పుకోవాలి. అలానే 6 జెడ్పీటీసీలలో 4 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 21 పంచాయితీ సమితిలలో 12 చోట్ల విజయం సాధించడం కూడా ఆ పార్టీలో ధీమా కలిగిస్తోంది.
అధికారంలో ఉన్న బిజెపికి మైనస్ పాయింట్లుగా  చెప్పుకోవాల్సివస్తే ముందుగా  వసుంధర రాజె సింధియా పేరునే చెప్తున్నారు. ఆమె నిరుద్యోగ సమస్యని పట్టించుకోకపోవడం తమ కొంప ముంచుతుందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఐతే 2013లో 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బహుజన్ సమాజ్ పార్టీ,  కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోకపోవడం కాస్త రిలీఫ్. ఆ మేరకు ఓట్లలో చీలిక  తమకి సాయపడుతుందని బిజెపి అంచనా వేస్తోంది. అదే కాంగ్రెస్ సిఎం కాండిడేట్‌గా అశోక్ గెహ్లాట్‌ను కనుక రంగంలోకి దింపితే బిజెపి ఆశలు గల్లంతైనట్లే భావించాలంటారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా  తనదైన ముద్ర వేసిన ఈ సీనియర్ నేతని కాంగ్రెస్ ప్రస్తుతం లైమ్ లైట్‌లోకి తీసుకురావడం లేదు. రాహుల్ గాంధీ తన టీమ్‌లోని సచిన్ పైలెట్‌నే ప్రమోట్ చేస్తున్నారు.

Don't Miss