లక్నోలో క్రికెట్ స్డేడియం ప్రారంభించిన యోగి ఆదిత్యనాధ్, పేరు మార్పు పై నిరసన

17:27 - November 6, 2018

లక్నో: సంచలన నిర్ణయాలు తీసుకునే  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఇంకో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మారుస్తూ  తీసుకున్న నిర్ణయం మరువకముందే  లక్నోలోని ఏకన ఇంటర్నేషనల్ స్టేడియాన్ని  "భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకన క్రికెట్ స్టేడియం"గా పేరు మార్చి మంగళవారం ప్రారంభించారు. స్వర్గీయ వాజ్ పేయ్ గౌరవార్ధం పేరు మార్చినట్లు ఆయన చెప్పారు. తన సొంత వూరు గోరఖ్ పూర్ లో  ఉర్దూబజార్‌ను హిందీబజార్ గానూ, హుమాయూన్‌పూర్‌ను హనుమాన్‌నగర్, ఇస్లాంపూర్‌ను ఈశ్వరపూర్‌గా, మియాబజార్‌ను మాయాబజార్, అలీనగర్‌ను ఆర్యనగర్‌గా కూడా మార్చేశారు. ఇవాళ లక్నో లోని ఇంటర్నేషనల్ స్టేడియం కూడా పేరు మార్చి ప్రారంభోత్సవం చేశారు. 
50వేల మంది కూర్చునే కెపాసిటీ ఉన్నలక్నో ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియంలో ఈరోజు భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు స్టేడియం పేరు మార్చడాన్ని సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే స్టేడియం పేరు మార్పును ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ సమర్ధించుకుంటున్నారు. 1991 నుంచి 2009 మధ్య కాలంలో 5 సార్లు వరుసగా లక్నో ఎంపీగా సేవలు అందించినందుకే వాజ్‌పేయి సంస్మరణార్ధం ఈ స్టేడియానికి పేరు పెట్టడం జరిగిందని  తెలిపారు. వాజ్‌పేయి  ప్రభుత్వ హయాంలో క్రీడలను ఎంతగానో ప్రోత్సాహం అందించారని, ఆయన స్ఫూర్తితో దేశంలో ఉన్న అన్ని గ్రామాల్లో భారీ ఎత్తున విశాలమైన క్రీడా మైదానాలను నిర్మిస్తామని యోగి చెప్పారు. ఘజియాబాద్‌లో నిర్మింతమవుతున్న భారీ స్టేడియాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని యోగి తెలిపారు. 

 

Don't Miss