జ‌గ‌న్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు పెట్టుకుంటారా?

09:14 - October 8, 2018

ఏలూరు:  రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నే విషయం తెలిసిందే. ఆయా పార్టీల అవ‌స‌రాలు, ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రితోనైనా చేతులు క‌లుపుతారు, పొత్తులు పెట్టుకుంటారు. తెలంగాణలో ఏం జ‌రిగిందో అంతా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సంచ‌ల‌నానికి తెర‌తీసింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నాయి. ఇదే ఫార్మాల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఫాలో అవుతారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నికల్లో  అధికారంలోకి వ‌చ్చేందుకు వ్యూహం ర‌చిస్తున్న ప‌వ‌న్...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   

ఈ విశ్లేష‌ణ‌కు కార‌ణం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాకు శత్రువు కాదు అని చెప్పి పవన్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న సృష్టించారు. జగన్ నా శత్రువు కాదు.. అస‌లు నాకు శత్రువులెవరూ కూడా లేరు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమ‌న్నారు. నేను పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఎన్టీఆర్ మాదిరిగా ఉప్పెన లేదు.. నా సోదరుడు చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో అభిమానుల ప్రవాహం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తారనే ఉద్దేశ్యంతోనే తాను 2014లో టీడీపీకి మద్ద‌తిచ్చినట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. మోసాలు చేస్తే  చూస్తూ ఊరుకోనని హెచ్చ‌రించారు.
 
అయితే జగన్ శత్రువు కాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చర్చ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో పవన్ జగన్‌తో పొత్తు పెట్టుకుంటారా? అనే దాని గురించి చర్చించుకుంటున్నారు. అయితే గతంలో పవన్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయ‌డం, ఆ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే స్పందించడం తెలిసిందే. కాబట్టి జ‌గ‌న్ తో పొత్తు ఉండ‌క‌పోవ‌చ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గొచ్చు.

Don't Miss