కంట్రీఫుడ్ మస్తానమ్మ మృతి: సోషల్ మీడియా ఘన నివాళి

11:44 - December 5, 2018

గుడివాడ(గుంటూరు) : యూట్యూబ్‌లో ఆంధ్ర వంటకాల ఘుమఘుమలతో పాపులర్‌ అయిన కర్రె మస్తానమ్మ తన 107 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ముప్పై ఏళ్లు వస్తే మోకాళ్ల నొప్పులు..నలభై ఏళ్లు వస్తే నడుం నొప్పులతో అల్లాడిపోయే నేటి యువతకు ధీటుగా 100 సంవత్సరాలు పైబడినా అవలీలగా సంప్రదాయ పద్ధతుల్లో ఎన్నో వంటలు చేస్తు యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయిరు మస్తానమ్మ. ఈమె వంటల రుచులకు దేశ విదేశాల్లో కూడా అభిమానులుగా చేరిపోయారు.  
మస్తానమ్మకు లక్షలమంది ఫాలోయర్స్..
నేల పొయ్యిమీదనే కట్టెలతో వంటలు చేస్తు..లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకున్న వంటల బామ్మ మస్తానమ్మ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని గుడివాడకు చెందిన మస్తానమ్మ 2016 ఆగస్టు 19న చేతివంట వీడియోను ఆమె మనుమడు లక్ష్మణ్‌ మొదటిసారి యూట్యూబ్‌లో ప్రదర్శించారు. ఆ వీడియోతో ఆమె ఫేమస్ అయిపోయింది. ఆ వీడియోకు మంచి ఆదరణ లభించటంతో పాటు భారీగా లైక్‌లు, షేర్లు వచ్చాయి. దీంతో ‘కంట్రీఫుడ్స్‌’ పేరుతో ప్రత్యేక యూట్యూబ్ చానెల్‌నే ఏర్పాటు చేసేశారు. 
ఆమెను కలుసుకునేందుకు విదేశస్తులు కూడా ఆసక్తి చూపారు. అంతేకాదు ఆమెకు రకరకాల కానుకలను కూడా పంపించేవారు. 2017లో 106వ జన్మదిన వేడుకలకు  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 
విషాదాల మస్తానమ్మ జీవితం..
11వ ఏటనే వివాహం జరిగిన మస్తానమ్మకు ఐదుగురు సంతానం.  22వ ఏటనే భర్త మరణించాడు. ఐదుగురు పిల్లల్లో నలుగురు మరణించగా ఉన్న ఒక కుమారుడిని తానే రెక్కల కష్టంతో పోషించారు. మస్తానమ్మ మనుమళ్లు ప్రస్తుతం ఆమె మంచిచెడు చూసుకుంటున్నారు. పుచ్చకాయ చికెన్‌ తయారీ, కబాబ్‌లు, మటన్‌, చికెన్‌లతో వెరైటీ కర్రీస్‌, ఘుమఘుమలాడే బిర్యానీలు, రొయ్యలు, పీతలతో వంటకాలకు ఆమె ప్రత్యేకం. 
యూట్యూబ్‌ అభిమానులను ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న మస్తానమ్మ వయసు రీత్యా కొద్ది రోజులుగా వంటకాల వీడియోలకు దూరంగా ఉన్నారు. ఆమె మరణ వార్త యూట్యూబ్‌ అభిమానులను సైతం ఆవేదనకు గురిచేసింది. ఆదివారం స్వగ్రామం గుడివాడలో మస్తానమ్మ అంతిమ సంస్కారాలను గ్రామస్తులు ఊరేగింపుగా నిర్వహించారు. ఆమె అంతిమ యాత్రను సోషల్‌మీడియాలో లైవ్ కూడా ఇవ్వడం విశేషం.

Don't Miss