వాతల వైద్యం : చిన్నారుల లేతచర్మంపై సూదితో వాతలు

Submitted on 26 May 2019
cruel treatment Manyam

కీలెరిగి వాతపెట్టాలి.. ఇది పాతకాలపు వైద్యపద్దతి ఆధారంగా పుట్టిన సామెత. నొప్పి ఉన్న చోట వాతలు పెడితే ఉపశమనం కలుగుతుందనేది ఆనాటి వైద్యం. చదువులేని కాలంలో నమ్మిన ఓ మూర్ఖ విధానం. సమాజం అభివృద్ధి చెందినా.. రోబోలతో శస్ర్త చికిత్సలు చేస్తున్నా నేటికి ఇదే విధానాన్ని అనుసరిస్తూ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు గిరిజనులు.  

చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నా విడవరు. చేతులు, కాళ్లు పట్టుకొని వాతలు పెడుతున్నారు. ప్రతిసారి వేడి చేస్తూ.. ఆ లేలేత శరీరంపై నిప్పు కణికలా మారిన సూదితో కర్కశంగా మానని గుర్తులను చెక్కుతున్నారు. ఆ చిన్నారి విలవిలాడుతున్నా.. డొక్క వెన్నుకు తాకేలా వెక్కి వెక్కి ఏడుస్తున్నా ఆపడం లేదు. ఆరోగ్యం కోసమంటూ అమానుష చర్యకు పాల్పడుతున్నారు. 

విజయనగరం గిరిజన తండాల్లోని మూఢ, మూర్ఖ నమ్మకమిది. చిన్న పిల్లలకు ఇలా కాల్చిన సూదితో వాతలు పెడితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావనుకునే గిరిజనం చేస్తున్న అమానుషం. ప్రపంచం ఇంత అభివృద్ధి చెందినా.. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. విజయనగరం జిల్లా ఏజెన్సీ గ్రామాలు మాత్రం మధ్య యుగాల నాటి వైద్యాన్నే నమ్ముతున్నారు. ఎలాంటి రోగం వచ్చినా.. దానికి విరుగుడుగా వాతల వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు.

అప్పుడే పుట్టిన చిన్నారులకు భవిష్యత్‌లో ఎటువంటి రోగాలు ప్రబలకుండా ఉండేందుకు సహజంగా టీకాలు వేస్తుంటారు. ఉబ్బసం, కామెర్లు, ఉదర సంబంధ వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ టీకాలను ఉచితంగా సరఫరా చేస్తుంది. అయితే, ఏజెన్సీ గ్రామాల ప్రజలు మాత్రం మూఢ నమ్మకాలను ఇంకా వీడలేకపోతున్నారు. పాతకాలం నాటి నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు వాతలు పెడుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలకు వెళితే.. ఈ వాతల వైద్యంతో విలవిలలాడుతున్న చిన్నారులే కనిపిస్తారు. అక్కడ ఏ చిన్నారిని చూసినా.. శరీరంపై వాతల తాలూకు గాయాలతో దర్శనమిస్తారు. రోబోలతో ఆపరేషన్లు చేసే స్థాయికి వైద్యరంగం అభివృద్ధి చెందినా.. మెడికల్‌ టూరిజంగా దేశం ముందుకు వెళుతున్నా.. ఇంకా మన్యం మాత్రం మారడం లేదు. ప్రమాదకరమని తెలియక దశాబ్ధాలుగా ఈ వాతల వైద్య విధానాన్నే పాటిస్తున్నారు. 

లోకం మారింది.. ప్రపంచం మున్ముందుకు దూసుకుపోతోంది. అయినా కొన్ని ప్రాంతాలు మాత్రం వెనక్కి ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా మన్యం పరిస్థితి మరింత దైన్యంగా తయారైంది. చదువు లేకపోవడం, అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తుండటం, ప్రభుత్వ చర్యలు తూతూమంత్రంగా చేస్తుండటంతో వారి ప్రాణాలకే ప్రమాదంగా మారింది. రోగం వస్తే పసరు వైద్యం చేయడం గిరిజన గ్రామాల్లో పరిపాటి. అలాగే ఇంటివద్ద ప్రసవాలు కూడా సర్వ సాధారణమే. అలాగే చంటి బిడ్డలకు ఉదర సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయన్న నమ్మకంతో ఏడాదిలోపు పిల్లలకు పొట్టపై వాతలు పెడుతున్నారు.

కిరోసిన్ దీపపు బుడ్డీ మంటలో కొబ్బరినూనెతో తడిపిన సూదిని బాగా కాల్చి, నూనె రాసిన పొట్టపై చురకలంటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పొట్టలో బల్లలు ఏర్పడవని, తిండి త్వరగా జీర్ణం అవుతుందని  కణతలు, కడుపునొప్పి వంటి వ్యాధులకు ఈ ప్రాంత గిరిజనులు ఇలా సూదిని ఎర్రగా కాల్చి పొట్టపై వాతలు పెడుతుంటారు. ఈ వాతల వైద్యం రోగ నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుందని వీరి నమ్మకం. దశాబ్ధాలుగా ఇదే పద్దతిని పాటిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

లేత చర్మంపై కాల్చుతుండటంతో కొందరు చిన్నారులకు చర్మవ్యాధులు సోకుతున్నాయి. కొంతమంది పిల్లలైతే తీవ్ర అస్వస్థతకు గురై పరిస్థితి విషమించుతోంది. ఇటీవల సాలూరు ఏజెన్సీలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాచిపెంట మండలం ఊబిగుడ్డి గ్రామంలో అప్పుడే పుట్టిన కవల పిల్లలకు ఇలా వాతలు పెట్టడంతో వారి పరిస్థితి విషమించింది. దీంతో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అంతకు ముందు కూడా ఇదే గ్రామానికి చెందిన ఓ చిన్నారికి  ఇటువంటి పరిస్థితే ఎదురైంది. అయినా అక్కడ పద్ధతి మాత్రం మారలేదు.

ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఈ గిరిజన గ్రామాలకు సరైన వైద్య సదుపాయం లేకపోవడం వలనే వీరు ఇలాంటి నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రయాణ సౌకర్యం లేకపోవడం, సకాలంలో వైద్య సదుపాయం అందకపోవడం వలన తరచూ వచ్చే రోగాలకు వీరు ఇలాంటి నాటు పద్దతులను పాటిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ వాతల వలన పిల్లల పొట్టలపై వికారమైన గుర్తులు కనిపించడమే కాకుండా, ఒక్కోసారి అవి పెద్ద పెద్ద గాయాలుగా మారుతున్నాయి. ఇటువంటి నాటు పద్దతులను ఆశ్రయించడం శ్రేయస్కరం కాదని, అనారోగ్యం సోకితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇలాంటి దారుణాలు జరుగుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం స్పందించడం లేదు. దశాబ్దాలుగా ఈ మూఢ నమ్మకాలు ముక్కు పచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదు. అందుబాటులో వైద్య సదుపాయాలను సమకూర్చడం లేదు. ఇప్పటికైనా.. ప్రభుత్వ అధికారులు కళ్లు తెరవాలని, మన్యంలోని మూఢ, మూర్ఖ వైద్య విధానాన్ని పారద్రోలాలని కోరుకుందాం. ఆ చిన్నారుల జీవితాలపై వాతల తాలూకు మరకలు లేకుండా చేస్తారని ఆశిద్దాం.

cruel
Treatment
Manyam
vizayanagaram
Girijanulu

మరిన్ని వార్తలు