దూసుకొస్తున్న వాయు తుపాను : గుజరాత్‌కు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు

Submitted on 12 June 2019
Cyclone Vayu turns very severe

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను తీవ్ర రూపం దాల్చింది. తీరం దిశగా దూసుకొస్తోంది. గురువారం(జూన్ 12, 219)  ఉదయం గుజరాత్‌ తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే సమయంలో తుపాను మరింత ప్రచండ  రూపం దాలుస్తుందని చెప్పింది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అంచనా వేసింది. ‘వాయు’ తుపాను  ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ముమ్మరం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు  తీసుకుంటోంది.

వాయు తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా గుజరాత్, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్,  మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో వాయు తీవ్రత అధికంగా ఉండనుంది. మరో రెండు రోజులు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

వాయు తుపానును ఎదుర్కోవడానికి చేసిన ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. ప్రజలను రక్షించడానికి వీలైనన్ని  చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ విభాగం.. 26 బృందాలను వీరావల్ ఓడరేవు సహా గుజరాత్‌లోని  తీరాల వెంట మోహరించింది. అదనంగా మరో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గుజరాత్ కి తరలించారు. తుపాను తీరం దాటిన తర్వాత  గుజరాత్, డయూ ప్రాంతాల్లో సహాయక చర్యలను అందించనున్నారు. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు  తరలిస్తున్నారు. మోర్బీ, కండ్లా, గాంధీదామ్ ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

వాయు తుపాను ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురవనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం  ముగిసినా సూర్యుడి ప్రతాపం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రుతుపవన తేమ గాలులు, భూ ఉపరితలం మీద ఉన్న గాలులు మొత్తం  తుపాను దిశగా పయనిస్తున్నాయని.. దీంతో తెలంగాణ, ఏపీ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయని వాతావరణ  శాఖ అధికారులు తెలిపారు. వాయు తుపాను తీరం దాటితే కానీ రుతుపవనాలు విస్తరించవని, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం  లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Cyclone Vayu
Turns
very severe
NDRF
Gujarat

మరిన్ని వార్తలు