వాయు తుఫాన్ : వణుకుతున్న గుజరాత్

Submitted on 12 June 2019
Cyclone vayu Update Gujarat Heavy Rains

అరేబియా స‌ముద్రంలో ఏర్పడిన వాయు తుపాన్ గుజ‌రాత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాన్ ధాటికి గుజ‌రాత్ తీరంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బ‌ల‌మైన ఈదురు గాలులు వీస్తున్నాయి. మరోవైపు స‌ముద్రంలో రాకాసి అల‌లు ఎగిసి పడుతుండటంతో అల్లకల్లోలంగా మారింది. వాయు తుఫాన్ జూన్ 13వ తేదీ గురువారం ఉద‌యం గుజ‌రాత్‌లోని పోర్బంద‌ర్‌, మ‌హువా మ‌ధ్య తీరాన్ని తాకే అవ‌కాశం ఉన్నట్లు  వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేశారు.

తీర ప్రాంత ప‌ట్టణం పోర్‌బంద‌ర్‌పై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. పోర్‌బంద‌ర్ స‌మీపంలో స‌ముద్రం దాదాపు 30 మీట‌ర్ల వ‌ర‌కు ముందుకు వచ్చింది. తీర ప్రాంతాల‌ను ముంచెత్తింది. ఆరు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. వాయు తుఫాన్ సృష్టించ‌బోతున్న బీభ‌త్సాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జాతీయ విప‌త్తు నిర్వహణ బ‌లగాల‌ను గుజ‌రాత్‌కు త‌ర‌లించింది.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్ బ‌ల‌గాల‌ను తీర ప్రాంతాల్లో మోహ‌రింప‌జేసింది. తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లిస్తున్నారు. జూన్ 12వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సుమారు 2 లక్షల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

మ‌త్స్యకారుల ఇళ్లను కూడా ఖాళీ చేయించారు. తుఫాన్ తీరాన్ని దాటే స‌మ‌యంలో బ‌లమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని, వాటి వేగం గంట‌కు 155 నుంచి 170 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఉండొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.

దీంతో రైల్వేశాఖ తుఫాన్ తాకిడి తీవ్రంగా ఉండే ప్రాంతాల మీదుగా రైళ్ల రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేసింది. విమానయాన శాఖ కూడా తమ స‌ర్వీసుల‌ను నిలిపివేసింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

విరావ‌ల్ ఓఖా, పోర్‌బందర్, భావ్‌నగర్, భుజ్, గాంధీధామ్ స్టేషన్ల మీదుగా రాక‌పోక‌లు సాగించే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైలు స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇక ఇప్పటికే ఆయా స్టేషన్లలో చిక్కుకుపోయిన వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక రైలుని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

cyclone
vayu
Gujarat
HEAVY Rains

మరిన్ని వార్తలు