దీపాల వేడుక అందరికీ కావాలి వెలుగుల పండుగ...

07:21 - November 7, 2018

హైదరాబాద్ : దీపం ప్రాణానికి ప్రతీక. పరమాత్మకి ప్రతిరూపం. అందుకే ఏపూజకైనా ముందు దీపారాధనతోనే ప్రారంభిస్తారు. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. ఏ ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు పెద్దలు. ముక్కోటి దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపాన్ని ఎలా ఆరాధించాలీ, దీపారాధన సమయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించాలీ మొదలైన అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పెద్దలు.

Image result for deepavaliపంచ భూతాత్మక సృష్టికి ప్రతీక దీపం. దీప కాంతి జ్ఞానానికీ, శుభానికీ, శాంతికీ సంకేతమనే ఆర్య భావనా సంస్కృతి మనది. పర్యావరణహితంగా పూలు, రంగవల్లులు వాటి నడుమ వెలిగే అందమైన దీపాలు మనలో ఆనందాలు నింపే అసలైన వెలుగులు. ఒక చిన్న దీపం గదిలోని చీకటినంతటినీ తరిమేస్తుంది. అలాంటిది మంచి మనసుతో బంధాల అమరికతో ఒదిగిన కుటుంబమంతా కలిసి దీపాల వరుసను పేర్చి దీప జ్యోతిని ఆరాధిస్తే ఇల్లంతా నిజ కాంతితో వెలిగిపోతుంది. దీపారాధన భారతీయులకు నిత్య సమారాధన. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దేవుడి ముందు దీపాలను వెలిగించి అంతా మంచే జరుగాలని కోరుకుంటాం. ఏదైనా మంచి పనిని మొదలు పెట్టేముందు జ్యోతి ప్రజ్వలనం చేసి నిరాటంకంగా అనుకున్న పని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తాం. అలాగే దీపావళి రోజు ప్రపంచంలోని చెడంతా నశించి మంచితో నిండిపోవాలని వెలిగించే దీపాలు జీవిత వెలుగులకు సంకేతాలుగా భావించాలి. ఆ దీపాల వెలుగులను ప్రతీ ఒక్కరూ తమ జీవితాలను ఆపాదించుకునే వెలుగులను నింపుకోవాలి. అప్పుడే దీపావళి పండుగకు అసలైన నిర్వచనం.

‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటుంది వేదం... చీకటి నుంచి వెలుగులోకి నన్ను నడిపించు అని దీని అర్థం... చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు. చిన్న దివ్వెను వెలిగించిచూడు అనే అమృత ప్రబోధమే దీపావళి ఆంతర్యం. చీకటిని దుఃఖానికి, వెలుగును సంతోషానికి ప్రతీకలుగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇవి రెండూ తప్పవు. దుఃఖాన్ని జయించి, ఆనందాన్ని సాధించాలన్న మనిషి యత్నానికి దీపావళి ఓ సంకేతం. సత్యం నుంచి సత్యంలోకి, చీకటి నుంచి వెలుగులోకి, మృత్యువులోంచి అమర్వతంలోకి నడిపించమనే వేదవాక్కు దీపావళి పండుగలో ఒప్పారే దివ్య సందేశంగా విరాజిల్లుతూ మన జీవితాలను వెలుగులమయం చేయాలని ఆకాంక్షిద్దాం. దీపావళి పర్వదినం సందర్భంగా 10టీవీ సోషల్ మీడియా వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు..

 

 

 

 

 

Don't Miss