దొరసాని మూవీ రివ్యూ

Submitted on 12 July 2019
Dorasani Movie Review and Rating

ప్రేమ - చదువు - విప్లవం ఈ మూడూ ప్రమాదకరమైన పదాలు. ఈ మూడింటి మధ్య నడచిన కథే దొరసాని. సినిమా చాలా అంశాలను తడిమింది. ఉలిక్కిపడేలా చేసింది. దొరల అణచివేత ప్రజల మీదే కాదు.. గడీలో బతికే కుటుంబసభ్యులపై కూడా కొనసాగింది. భార్య, కూతుళ్లపైనా క్రూరమైన అణచివేత సాగింది. శీలం కట్టుబాట్లు అన్నీ తమ ఇంటి ఆడవారికి మాత్రమే అని కూడా అనుకుంటుంది. గడీలో పనిచేసే ఆడవాళ్లకి ఇలాంటివేవీ ఉండవని నమ్ముతుంది. అందుకే తన కూతురు తక్కువ కులం వాణ్ణి ప్రేమిస్తే తట్టుకోలేదు.. తాను మాత్రం కింది కులం ఆడవాళ్ల మీద లైంగిక దాడి స్వేచ్చగా చేస్తూనే ఉంటారు. భూస్వామ్యం ప్రధానంగా అంగీకరించనిది.. కింది కులాల చైతన్యాన్ని. దానికి దోహదపడే చదువును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. లొంగుబాటు తనం బలంగా కొనసాగాలంటే వారు సాధ్యమైనంతగా చదువుకు దూరంగా ఉండాలని అనుకుంటుంది. అలా అనుకోవడం వల్ల సాధించే లాభాలేమిటో కూడా దొరసాని చిత్రంలో చూపిస్తాడు దర్శకుడు.

రాజు.. దొరసానిని ప్రేమించడమే దుర్మార్గం అని సాక్షాత్తు అతనితో పాటు బానిస జీవితాలు గడుపుతున్న అతని వారే అనడం.. కుదిరితే అతన్ని పట్టించేయాలని పట్టుదలతో వెతకడానికి బయల్దేరేంత బానిస చైతన్యం చూపిస్తాడు. ఇంతకన్నా ప్రమాదకరమైన సమాజం మరొకటి ఉండదనిపించేంత బాగా తీశాడా సన్నివేశాలను దర్శకుడు.

ప్రేమ - చదువు ఈ రెండూ సమాజాన్ని అర్ధం చేసుకుని.. దీని మార్పును కోరుకుంటాయి. అలా కోరుకోవడాన్నే రాజకీయ పరిభాషలో విప్లవం అంటారు అనుకుంటే.. ఈ రెండూ విప్లవానికే దారితీస్తాయి. అందుకే విప్లవకారుడు ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. ప్రపంచ విముక్తికి స్వప్నిస్తాడు. అందుకే ఏ ప్రేమికుడిలో అయినా తన తోటి విప్లవకారుడ్ని చూస్తాడు. ప్రతి విప్లవకారుడూ అద్భుతమైన ప్రేమికుడే. అందుకే రాజు లోని ప్రేమికుడ్ని విప్లవకారులే గుర్తిస్తారు. దొరతనాన్ని కూల్చడానికి పోరాటం చేస్తున్న విప్లవకారుడ్నీ.. దొరసానితో ప్రేమ నడుపుతున్న కుర్రాణ్ణీ పోలీసులు ఒకేలా చూడ్డం.. ఇద్దర్నీ చంపేయాలనుకోవడం చాలా చక్కని సన్నివేశం. నువ్వూ దొరసానీ పెళ్లి చేసుకోవాలి. నిన్ను తను అంతగా ప్రేమించడం ఒక మంచి పరిణామం.. మీరిద్దరూ కలిసి జీవించడం పోరాట శక్తులకు కొత్త స్ఫూర్తిని ఇస్తుంది అని విప్లవకారుడు ప్రేమికుడితో చెప్పిన డైలాగ్ చాలా గొప్ప ఊహ.

అలాగే దొరగారు అందరినీ పేర్లు అడుగుతాడు. ఒక్క రాజు తప్ప మిగిలినోళ్లందరూ వారి పేరు చెప్పి బాంచన్ అంటారు. అదే నీ లోపం.. అందుకే నీ తల్లిదండ్రులను అరస్ట్ చేయాల్సొచ్చిందని అన్యాపదేశంగా దొర చెప్పే పద్దతి బావుంది. ఇది పరువు హత్య సినిమా అనే ప్రచారం ఇప్పటికే జరిగిపోయింది కనుక ఆ విషయం ప్రస్తావించనక్కరలేదుగానీ.. ఆ తరహా హత్యల వెనకాలున్న ఆలోచనల నేపధ్యాన్ని చెప్పడానికి ప్రయత్నించిన సినిమా. మధ్యతరగతి ఉదాసీనతను కూడా బలంగా ప్రశ్నించిన సినిమా. ఎంతో కొంత రిబరల్ అనిపించిన వ్యక్తే ద్రోహం చేసే సన్నివేశాలు రెండు మూడున్నాయి ఈ సినిమాలో. అవి దర్శకుడు ఊరికే పెట్టాడని అనుకోడానికి లేదు.

ప్రేమ కథల రొటీన్ ఫార్ములాకు కాస్త భిన్నంగా నడిపేందుకు దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర శత విధాలా ప్రయత్నించాడు. ఈ తరహా కథను తెరకెక్కించడానికి చాలా గట్స్ కావాలి. అవి మధుర శ్రీధర్ కూడా సమర్పకులు సురేష్ మూవీస్ వారికీ పుష్కలంగా ఉన్నాయనే అనిపిస్తుంది. నట వారసత్వంలో ముందుకు వచ్చిన ప్రేమికుల పాత్రధారులు శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ ఇద్దరూ తమ పాత్రల పరిధిలో ఇమిడిపోయే ప్రయత్నం చేశారు. మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందనిపించేలా సాగింది వారిద్దరి నటనా.

అయితే కథను నడిపిన తీరు కాస్త డ్రాగ్ గా అనిపించడం.. సాధారణ ప్రేక్షకులను కాస్త నిరుత్సాహాన్ని గురిచేసే అంశం. అలాగే వినోదానికి తగిన ప్రధాన్యత ఇవ్వకపోవడం కూడా ఒక లోపమే. స్నేహితుల పాత్రలను పూర్తిగా వాడుకోలేకపోయాడనే చెప్పాలి దర్శకుడు. ఫస్టాఫ్ లో కాస్తన్నా కనిపించిన వినోదం సెకండాఫ్ కు వచ్చే సరికి పూర్తిగా పక్కకు నెట్టేశారు. ప్రేమకథలను యాక్టివ్ ఫార్మెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో.. బలమైన ఎమోషన్స్ మధ్య చూడ్డానికి అలవాటు పడ్డ ప్రేక్షకులు ఏ మేరకు ఈ చిత్రాన్ని ఆదిరిస్తారనేది చూడాలి.

ప్లస్ పాయింట్స్ :
కథను కొత్తగా చెప్పే ప్రయత్నం
రెగ్యులర్ అనిపించని లొకేషన్లు
కెమేరా పనితనం
నేటివిటీ వినిపించిన సంగీతం

మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
డల్ గా అనిపించిన హీరో ఆనంద్
నటీనటుల్ని వాడుకోవడంలో లోపం

Dorasani
movie
review
rating
Tollywood
Anand devarakonda
Sivatmika


మరిన్ని వార్తలు