తెలంగాణతోనే ప్రారంభమయ్యే సీసీ కెమెరాల యత్నం..

15:25 - November 6, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండంలో తగిన ఏర్పట్లను ఈసీ సిద్ధ చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలపై ఈసీ కన్ను వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి అన్ని పోలింగ్ కేంద్రాల్లోను సీసీ కెమెరాలను అమర్చాలనే ఆలోచనలో వున్నట్లుగా సమాచారం. అదే కనుక జరిగితే  పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చటం ఇదే తొలిసారి అవుతుంది. 
సున్నితమైన, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు వినియోగించే విధానాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే అమలు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, మధ్యప్రదేశ్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో శాసనసభలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్న క్రమంలో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నిఘా కెమెరాలు వినియోగించే విషయమై ఇటీవల చర్చించింది. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల నిబంధనల అమలు, రిగ్గింగ్‌ సహా ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే ఈ విధానం అనుసరించాలన్న నిర్ణయానికి  వచ్చింది. మిగిలిన రాష్ట్రాల సంగతెలా ఉన్నా తెలంగాణలో మాత్రం దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా మొత్తం అన్ని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఈసీ ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. ఈ చర్చ అనంతరం తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో మొత్తం 32,574 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అన్నింట్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాదాపు రూ.48.86 కోట్ల మేరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘‘ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యం ఉన్నందున కెమెరాల అమరిక కష్టసాధ్యమేమీ కాదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమాండ్‌ కంట్రోల్‌ రూంలతో  వాటిని అనుసంధానించి పర్యవేక్షించే యంత్రాంగం కూడా రాష్ట్రంలో ఉంది’’ అని అధికారులు పేర్కొంటున్నారు.

 

Don't Miss