రాజులకు భంగపాటు...సామాన్యుల చేతిలో ఓడిన సంస్ధానాధీశులు

Submitted on 26 May 2019
Election Round up on Vizianagaram

రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. ఇది ఒకప్పటి మాట. కానీ మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే... కంచుకోటల్లాంటి ఖిల్లాలు ఫ్యాను గాలిలో కొట్టుకుపోయాయి. సర్వ శక్తులు ఒడ్డినా... విజయనగరం జిల్లాలో రాజులకు శృంగభంగం తప్పలేదు. 

విజయనగరం జిల్లా అంటేనే రాజుల పేర్లు వినిపిస్తాయి. రాజ వంశీకులకు ఈ ప్రాంతంలో కొదువే లేదు. యుద్ధాల్లో కత్తులు దూసి.. శతృవులను సంహరించిన రాజ కుటుంబీకులు కోకొల్లలుగా కనిపిస్తుంటారు. కాలక్రమంలో రాజ్యాలు పోయాయి. రాజరికం అంతరించిపోయింది. దీంతో.. రాజకుటుంబీకులు.. ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. తమకు ఎదురులేదని నిరూపించుకుంటూ వచ్చారు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో మాత్రం జిల్లాలోని రాజులకు వారి వారసులకు ఘోర పరాభవం ఎదురైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. జిల్లాలో పేరు మోసిన రాజవంశీయులు, నేతలంతా చిత్తు చిత్తుగా ఓడిపోయారు. 

విజయనగరం జిల్లాలో విజయనగరం నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు పూసపాటి అశోక గజపతిరాజు పోటీ చేశారు. అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కుమార్తె అదితి గజపతి, బొబ్బిలి నుంచి మరో రాజవంశీయులు సుజయ కృష్ణా రంగారావు పోటీ చేశారు. కురుపాం సంస్థానాదీశులు వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌తో పాటు.. చినమేరంగి రాజు శత్రుచర్ల విజయరామరాజు కుటుంబీకులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ... ఘోరంగా ఓడిపోయారు. గత ఎన్నికల్లో సుజయ కృష్ణ రంగారావు వైసీపీ నుంచి పోటీ చేసి ఆ తర్వాత టీడీపీలో చేరారు. వాస్తవంగా అశోకగజపతి రాజు, సుజయ కృష్ణ రంగారావు కుటుంబీకుల మధ్య శతాబ్దాలుగా వైరం ఉంది. కానీ.. ఇద్దరు ఒకే గొడుగు కిందకు రావడంతో.. అది పూర్తిగా సమసిపోయింది. రెండు రాజకుటుంబాలు కలిసాయి కానీ.. ప్రజల్లో మాత్రం పట్టు కోల్పోయారు. అభివృద్ధి, సంక్షేమం పట్టనట్లుగా వ్యవహరించడంతో.. ప్రజలు వారిని తిరస్కరించారు. దీంతో ఈ ఇద్దరు రాజులూ ప్రస్తుతం కోటలకే పరిమితమయ్యారు. విజయనగరంలో వైసీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగిన బెల్లాన చంద్రశేఖర్ చేతిలో అశోకగజపతి రాజు చిత్తుగా ఓడిపోయారు. ఆయన కుమార్తె అదితి గజపతి కూడా వైసీపీ అభ్యర్థి కొలగట్ల వీరభద్రస్వామి చేతిలో పరాజయం పాలయ్యారు. అటు వైసీపీ అభ్యర్థి వెంకట చిన అప్పలనాయుడు చేతిలో బొబ్బిలి రాజు సుజయ కృష్ణ ఓటమి చవి చూశారు. వైసీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతిలో బొబ్బిలి రాజు సుజయ కృష్ణ ఓటమి చవి చూశారు. 
 
నాలుగు దశాబ్ధాల పాటు కాంగ్రెస్‌లో ఉన్న కురుపాం రాజు.. వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆరుసార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన కిశోర్ చంద్రదేవ్.. మొన్నటి ఎన్నికల్లో అరకు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ... గొట్టేటి మాధవి అనే ఓ సామాన్యురాలి చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఆయన కుమార్తె శృతిదేవి కూడా ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక చినమేరంగి సంస్థానాదీశుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరి నరసింహ ప్రియ థాట్రాజ్ కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మొత్తం మీద విజయనగరం జిల్లాలో రాజకుటుంబీకులంతా ఒకే ఎన్నికల్లో పరాజయం పాలవడం చరిత్రలో ఇదే మొదటిసారి. 


మరిన్ని వార్తలు