కొడుకును హత్య చేసిన కన్నతండ్రి

Submitted on 26 May 2019
father killed the son

జగిత్యాల: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కన్నతండ్రి, తన కొడుకును బండ రాయితో  మోది దారుణంగా హత మార్చాడు.  అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..మల్లన్నపేట గ్రామానికి చెందిన లంబ లక్ష్మయ్య(60)కు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు రమేశ్(25) తరుచూ ఇంట్లోవారితో గొడవ పడుతూ ఉండేవాడు. వివాహమైన మూడేళ్లకు ఇతడి వేధింపులు భరించలేక భార్య విడాకులు తీసుకుంది. రమేశ్ ఒంటరిగా ఉంటున్నాడు. కొంతకాలం క్రితం బొంబయి, హైదరాబాద్ పట్టణాలకు ఉపాధి నిమిత్తం వెళ్లాడు. మూడు నెలల నుండి ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి, అన్నదమ్ములతో తరుచూ గొడవ జరిగేది.

శుక్రవారం ఇంట్లో ఓ శుభకార్యం నిర్వహించుకున్నారు. శనివారం కుటుంబ సభ్యులు అందరూ కలిసి విందు భోజనం చేశారు. మద్యం మత్తులో ఉన్న రమేశ్, తండ్రి లక్ష్మయ్యతో మరోమారు గొడవ పడ్డాడు. మాట మాట పెరిగింది. లక్ష్మయ్య తన చేతిలో ఉన్న కర్రతో రమేశ్ పై దాడికి దిగాడు. రమేశ్ కిందపడ్డాడు. తిరిగి ఎక్కడ తనపై దాడిచేస్తాడోనని భయపడిన లక్ష్మయ్య పక్కనే ఉన్న బండ రాయితో రమేశ్ తలపై మోదాడు.  రమేశ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లక్ష్మయ్య పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

murder
crime
Telangana
Jagtial

మరిన్ని వార్తలు