పొలంలోకి ఆవు వచ్చిందని..మహిళ చేతి వేళ్లు కోశారు..

15:05 - July 18, 2016

దేశంలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట అబలలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒళ్లు గొగురుపొడిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. పొలంలోకి వచ్చిందన్న నెపంతో ఓ ఆవును కొడుతున్నందుకు..దానిని ఆపిన మహిళ చేతి వేళ్లను కోసేశారు. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
మాల్డా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి సమయంలో ఆ కుటుంబానికి చెందిన ఓ ఆవు పక్కనే ఉన్న హరున్ షేక్ పొలంలోకి వెళ్లింది. దీనిని గమనించిన అతడు మరో కొంతమందితో కలిసి వచ్చి ఆవును చితకబాదడం ప్రారంభించాడు. మూగజీవిని కొడుతుండడం చూసిన మహిళ దానిని కొట్టవద్దంటూ వారించింది. తీవ్ర ఆగ్రహంలో ఉన్న వీరంతా ఆ మహిళపై దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. పదునైన కత్తితో ఆమె చేతి వెళ్లను కోశారు. అడ్డుగా వచ్చిన ఆమె కొడుకును సైతం విచక్షణా రహితంగా కొట్టారు. వీరి కేకలు విన్న గ్రామస్తులు అక్కడకు రావడం..హరూన్ అతని మిత్రులు పరారయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. రెండు చేతి వేళ్లను కోల్పోయిన ఆమె..గాయాలపాలైన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని దుండగులు బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆవు పొలంలోకి వచ్చిన కారణంతో వారు నా భార్యను చంపాలని చూశారని, కేసు నమోదు చేస్తే అంతు చూస్తానని బెదిరిస్తున్నారని ఆమె భర్త పేర్కొంటున్నాడు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Don't Miss