కృష్ణా నదికి వరదలు : భయాందోళనలో స్థానికులు

Submitted on 13 August 2019
Flooding of Krishna River

కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో చుట్టుపక్క గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు నదీతీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. 2009 తరువాత మళ్లీ కృష్ణా నదికి అంతటి స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది.


పదేళ్ల కిందట 2009లో అత్యధికంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 25.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పుడే కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఊహించని నష్టం జరిగింది! మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు 10.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇటు కృష్ణా నదితోపాటు అటు తుంగభద్ర నదిలోనూ వరద ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. కృష్ణా, భీమా నదుల ఉధృతితో నారాయణపేట జిల్లాలో పంటలు నీట మునిగాయి. 

ఇప్పటికే వేలాది హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాలు నీటి మునిగిపోయాయి. దీంతో వరద బాధితులను అధికారులు పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 2009 పరిస్థితి పునరావృతం అవుతుందా అనే ఆందోళన నదీ తీర ప్రాంతవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. 2009 అక్టోబరు 2న వచ్చిన వరదతో వంతెనలు కూలిపోవడం, వేలాది గృహాలు నీట మునిగిపోవడం, రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు వరదనీటిలో  కొట్టుకుపోవడం వంటి ఘటనలు జరిగాయి. కృష్ణమ్మ ఉగ్రరూపంతో  ఆనాటి వరద బీభత్సం మళ్లీ ఎదురుకానుందని కృష్ణానదీ తీరప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే గద్వాల జిల్లాలో రెండు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఇప్పటికే ఇటిక్యాల, అలంపూర్‌ ప్రాంతాలకు రావడం మొదలైంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. ఆలమట్టి నుంచి నాగార్జున సాగర్‌ వరకూ అన్ని రిజర్వాయర్లలోనూ కొంత ఖాళీ ఉండేలా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

krishna river
AP
Telangana
Flooding

మరిన్ని వార్తలు