పెరిగిన బంగారం ధర : రూ.34వేలు దాటింది

Submitted on 20 June 2019
gold prices hike

బంగారం ధరలు పెరిగాయి. ఐదేళ్ల గరిష్టానికి చేరాయి. వడ్డీ రేట్ల తగ్గింపునకి ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్ సిద్ధం కావడమే దీనికి కారణం. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం(జూన్ 20,2019) బంగారం ధర ఏకంగా 5ఏళ్ల గరిష్టానికి చేరింది. ఔన్స్‌ పసిడి ధర 47డాలర్లు (3.50శాతం) పెరిగి 1395.35 డాలర్ల స్థాయిని తాకింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లపై యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. బలహీనపడిన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు పలు సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లపై మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఈ వైఖరి డాలర్‌కు ప్రతికూలంగా, పసిడికి సానుకూలంగా మారింది. అందుకే బంగారం ధరలు పెరిగాయంటున్నారు. ఇప్పుడు పసిడి టార్గెట్‌ ధర 1400 డాలర్లకు చేరుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఔన్స్‌ పసిడి ధర 40 డాలర్లు లాభంతో 1,389.30 డాలర్ల దగ్గర ట్రేడ్‌ అయ్యింది.

అంతర్జాతీయంగా, దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరలు పెరిగాయి. దేశీయ మార్కెట్ లో పసిడి ధర రూ. 34వేల మార్క్‌ను దాటింది. గురువారం(జూన్ 20,2019) ఒక్కరోజే రూ. 280 పెరగడంతో 10 గ్రాముల పుత్తడి రూ. 34వేల 020 పలికింది. వెండి ధర కూడా పెరిగింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో గురువారం ఒక్క రోజే ఏకంగా రూ. 710 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్ లో కేజీ వెండి ధర రూ. 39వేల 070కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధర 5ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో దేశీయంగా పసిడి ఫ్యూచర్లు లాభాల పట్టాయి. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్ లో పసిడి ఫ్యూచర్లు రూ.940లు(2.50శాతం) లాభపడి రూ.33వేల 920ల దగ్గర ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.789ల లాభంతో రూ.33వేల 868 దగ్గర ట్రేడ్‌ అయ్యింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్, బలహీనమైన ప్రపంచ వృద్ధి నేపథ్యంలో అందరి చూపు గోల్డ్ పై పడిందని... బంగారంపై పెట్టుబడులు సేఫ్ గా భావించారని నిపుణులు చెబుతున్నారు. వెండికి కూడా ఇదే వర్తిస్తుందన్నారు. ఈ కారణంగా గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయని వివరించారు.

gold price
hike
high
silver
bullion market

మరిన్ని వార్తలు