భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ : గ్రీన్ కార్డు బిల్లుకు గ్రీన్ సిగ్నల్

Submitted on 12 July 2019
Green signal to the green card bill in america

అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూర్చే గ్రీన్‌కార్డు బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికాలో శాశ్వత నివాసం, ఉద్యోగ వసతికి అనుమతించే గ్రీన్‌కార్డుల మంజూరుపై ఉన్న 7శాతం పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు (ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై-స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ చట్టం 2019 లేదా హెచ్‌ఆర్‌ 1044) 365-65 ఓట్లతో సభ ఆమోదించింది. ఇది చట్టంగా మారితే భారత్‌, చైనా తదితర దేశాలకు చెందిన ఐటీ, వృత్తి నిపుణులు ఎంతోకాలంగా గ్రీన్‌కార్డుల కోసం చేస్తున్న నిరీక్షణకు తెరపడుతుంది. ప్రస్తుత బిల్లు ఉద్యోగాలకు వచ్చేవారిపై దేశానికి ఇంత కోటా (7శాతం) అనే పరిమితిని ఎత్తివేయడం, కుటుంబాలు ఇతర అవసరాలతో వచ్చేవారికి సంబంధించి ఈ కోటా (7 నుంచి 15 శాతానికి)ను పెంచడానికి ఉద్దేశించింది.

ఉద్యోగ ఆధారిత వీసాలకు సంబంధించిన కొన్ని నిబంధనలను కూడా మార్చనున్నారు. ఈబీ-2, ఈబీ-3, ఈబీ-5 వీసాలకు కూడా కొంత శాతం కోటా కల్పించనున్నారు. సభలో సభ్యుడు జాన్‌ కర్టిస్‌ మాట్లాడుతూ ఈ బిల్లు అమల్లోకి వస్తే ముందొచ్చేవారికి ముందు.. విధానం ఉంటుందన్నారు. ఉద్యోగులు వారి కుటుంబాలకు, అమెరికాలో పెట్టే కంపెనీలకు ప్రయోజనకరంగా నిలుస్తుందని తెలిపారు. ఎవరైనా ఏ దేశంలో పుట్టారన్న విషయంతో సంబంధం లేకుండా వస్తు, సేవల నిపుణులను నియమించుకోవడానికి, ఉద్యోగాలు కల్పించడానికి వీలు పడుతుందని వివరించారు.

చట్టం కావాలంటే సెనేట్‌ ఆమోదం పొందాలి 
ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదముద్ర పడి చట్టం కావడానికి ముందు అధికార రిపబ్లికన్‌ పార్టీకి ఆధిక్యం ఉన్న సెనేట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమలా హారిస్‌ సహా పలువురు సెనేటర్లతో కూడిన ఓ గ్రూపు మద్దతిస్తున్న ఇదే తరహా బిల్లు మరొకటి కూడా త్వరలోనే సెనేట్‌ ముందుకు రానుంది.

గ్రీన్‌కార్డు మంజూరుకు అన్ని దేశాలవారినీ ఒకేలా చూసే విధానానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిందని మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌ బ్రాడ్‌ స్మిత్‌ తెలిపారు. వాణిజ్యానికి, మన ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చేలా అత్యంత నైపుణ్య వలస విధానాన్ని ఈ బిల్లు ప్రోత్సహిస్తుందన్నారు.

భారతీయ ఐటీ నిపుణుల హర్షం
భారతీయ ఐటీ నిపుణులు తదితరులంతా హెచ్‌-1బీ వర్క్‌ వీసాలపై అమెరికాకు వెళుతుంటారు. ప్రస్తుత విధానంలో చట్ట ప్రకారం శాశ్వత నివాసానికి గాను గ్రీన్‌కార్డు పొందడానికి 7 శాతం మాత్రమే పరిమితి ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానంలో గ్రీన్‌కార్డుల కోసం పలువురు భారతీయ హెచ్‌-1బీ వీసాదారుల నిరీక్షణ కాలం 70ఏళ్లకు పైగా కూడా పట్టే అవకాశం ఉంటుందని ఇటీవల కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఏళ్ల తరబడి వృత్తి నిపుణులు గ్రీన్‌కార్డుల కోసం చేయాల్సిన నిరీక్షణకు ప్రస్తుత బిల్లుతో తెరపడుతుందన్న హర్షం వ్యక్తమవుతోంది. విద్వేష దాడిలో మృతి చెందిన భారతీయ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల సతీమణి సునయన ఈ బిల్లు పట్ల హర్షం వ్యక్తం చేసినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.

ఈ బిల్లు పట్ల అమెరికాలోని భారతీయ వృత్తి నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి కాలిఫోర్నియాలోని సిలికాన్‌ వ్యాలీ, వాషింగ్టన్‌ స్టేట్‌లోని సియాటెల్‌, గ్రేటర్‌ వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌ తదితర ప్రాంతాల్లోని భారతీయ వృత్తి నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగ్రశ్రేణిలో ఉన్న అమెరికన్‌ ఐటీ కంపెనీలు కూడా ఈ బిల్లును స్వాగతించడం గమనార్హం. సెనేట్‌ కూడా త్వరలోనే దీన్ని ఆమోదించాలని కోరుతున్నాయి.
 

green card bill
Green Signal
america
USA House of Representatives

మరిన్ని వార్తలు