పట్టాలేక్కనున్న ఉదయ్‌ రైలు : విశాఖ-విజయవాడల మధ్య నడిపేందుకు పచ్చజెండా

Submitted on 14 August 2019
green signal to Uday's Double Decker Train

విశాఖకు మంజూరైన మరో రైలును భువనేశ్వర్‌కు తన్నుకుపోయేందుకు జరిగిన యత్నాలు విఫలమయ్యాయి. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు చాన్నాళ్ల క్రితమే విశాఖకు మంజూరైనా దాన్ని తీసుకురావడంలో నాన్చుడు ధోరణి అవలంభించిన తూర్పుకోస్తా రైల్వే ఉన్నతాధికారులు.. ఎట్టకేలకు విశాఖకు వచ్చిన రైలును కూడా తమ జోన్‌ ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌కు తరలించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే వారి ప్రయత్నాలకు రైల్వే శాఖ బ్రేక్‌ వేసింది. ఆ రైలు విశాఖకే కేటాయించినట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్ తెలిపారు. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలును విశాఖ, విజయవాడల మధ్య నడపనున్నట్లు తెలిపారు.

కేంద్రం నిర్ణయం వల్ల విశాఖ నుంచి రాష్ట్ర రాజధానికి మరో రైలు సౌకర్యం ఏర్పడింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇప్పుడున్న రైళ్లన్నీ నిత్యం కిటకిటలాడుతుంటాయి. డబుల్‌ డెక్కర్‌ పట్టాలపైకెక్కితే రద్దీని కొంతవరకు తట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. జలంధర్‌ నుంచి రాయగడ మీదుగా విశాఖకు ఉదయ్‌ను తీసుకొచ్చారు. డిపో నుంచి సాంకేతిక పరిశీలన తరువాత ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు వాల్తేరు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోక.. పంజాబ్‌లోని జలంధర్‌లో దిక్కూమొక్కూ లేకుండా ఉన్న ఈ ట్రైన్ .. ఇక విశాఖ విజయవాడ మద్య పరుగులు తీయ్యనుంది.

కేంద్రం నిర్దేశించిన నియమాలు ప్రకారం ఉదయ్‌ రైలులో ప్రత్యేక ఆధునిక సాంకేతిక సదుపాయాలున్నాయి. విశాలమైన అద్దాలు విమానంలో ఉన్నట్టుగా సీట్ల, వైఫై సదుపాయం, స్క్రీన్‌ల ద్వారా వచ్చే స్టేషన్‌ను ముందే తెలుసుకునే సౌకర్యం. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఉదయ్ ఉదయించనుంది. వాల్తేరు డివిజన్‌కు ఇదివరకు రెండు ఎల్‌హెచ్‌బీ రైళ్లున్నాయి. అందులో ఒకటి ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌, రెండోది తిరుమలకు వెళ్లే డబుల్‌ డెక్కర్‌ రైలు. ఇప్పుడు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకతో ఆ సంఖ్య 3కు చేరింది. ఈ రెండు రైళ్లకు తగ్గట్లు నిర్వహణ వ్యవస్థ సక్రమంగా ఉండేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు టిక్కెట్ ధర ఎంత అనేది నిర్ణయం తీసుకోకపోయినప్పటికి..ఇది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందాని అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది. 
 

Green Signal
Uday Double Decker
train
Visakhapatnam
vijayawada
union govt

మరిన్ని వార్తలు