19 అంశాలతో చంద్రబాబుకు హరీశ్ లేఖ..

12:11 - November 8, 2018

హైదరాబాద్ : సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ముందు 19 ప్రశ్నలను సంధిస్తూ, బహిరంగ లేఖను రాసిన ఆయన, పలు అంశాలను స్పృసించారు. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర చేయడం లేదా? పాలమూరు ఎత్తిపోతల కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? ఆ ప్రాజెక్టును నిర్మించారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

కాళేశ్వరంపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం మేము చేసిన పాపమా? కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్లను వద్దనలేదా? కల్వకుర్తిపై కుట్రలు చేశారన్నది నిజం కాదా? పోలవరానికి బదులు కృష్ణాకు నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడారా? లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీళ్లు ఇవ్వొద్దన్నది మీ కుతంత్రం కాదా? అని నిప్పులు చెరిగారు. ఎవరి అనుమతితో ఏపీలో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు? పోలవరం ముంపు మండలాలు అన్యాయంగా తెలంగాణకు దూరం చేయలేదా? సీలేరు విద్యుత్ ప్లాంటును తీసుకోవడం ద్వారా తెలంగాణకు ఏడాదికి రూ. 500 కోట్లు నష్టం వాటిల్లేలా చేసింది మీరు కాదా? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని ఏకపక్షంగా రద్దు చేసి తెలంగాణకు 2,465 మెగావాట్ల విద్యుత్ ఎగ్గొట్టలేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
 

Don't Miss