పెద్దవాళ్ల స్పెషల్: తిన్నది అరగాలంటే ఇలా చేయండి!

Submitted on 13 August 2019
Health Tips: Do This When You Are Eating Food

వయసు మీద పడుతున్న కొద్దీ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తినలేరు. ఒకవేల తిన్నా అరిగించుకోలేరు. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల పోషకాలు కూడా తగిన మొత్తంలో అందవు. అందుకే పెద్దవాళ్లకు ఆహారం విషయంలో ప్రత్యేక సూత్రాలను అందిస్తోంది ఆయుర్వేదం. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

ఎలా తినాలి? ఎంత తినాలంటే? :
పెద్దవాళ్లు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నా.. రోగాల నుంచి విముక్తం పొందాలన్నా ఆహారమే కీలకం. జీవితంలో అన్నిదశల్లోనూ అడుగడుగునా శక్తినిస్తూ.. మనల్ని వెన్నంటి నడిపించే ఈ ఆహారం గురించి ఆయుర్వేదం విపులంగా చర్చించింది. ఎలా తినాలి? ఎంత తినాలి? ఏయే వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనేవీ వివరించింది.  

ఆయుర్వేదంతో ఆరోగ్యం : 
కడుపు పూర్తిగా నిండేలా ఆహారం తీసుకోకూడదు. ఆయుర్వేదం జీర్ణాశయాన్ని 3 భాగాలుగా భావిస్తుంది. దీనిలో ఒక భాగం ఘన పదార్థాలు, ఒక భాగం ద్రవాలు ఉండేలా ఆహారం తీసుకోవాలని చెప్తుంది. ఇక మూడో భాగం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. కాస్త ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలైన నెయ్యి, నూనె, కొవ్వులతో కూడుకున్నవి తీసుకున్నప్పుడు ఈ నియమాన్ని పాటించాలి. అదే తేలికగా జీర్ణమయ్యే పదార్థాల విషయంలోనైతే జీర్ణాశయంలో సగభాగం వరకు ఆహారం తీసుకోవచ్చు.

నీళ్లు ఒకేసారి తాగొద్దు :
కొందరు అన్నం పూర్తిగా తిన్నాక ఒకేసారి నీళ్లు తాగుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. భోజనం చేసేటప్పుడు మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు తాగుతుండాలి. దీంతో ఆహారం మొత్తానికి నీరు సమంగా అందుతుంది. ఒకేసారి నీళ్లు తాగితే ఆహారం కిందే ఉంటుంది. నీరు పైకి తేలుతుంది. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాదు. మరీ వేగంగా గానీ మరీ ఆలస్యంగా గానీ భోజనం చేయరాదు. మరీ వేగంగా తింటే పొర పోయే అవకాశముంది. ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. అలాగే ఆలస్యంగా తిన్నా సరిగా జీర్ణం కాదు.

Read Also : డాక్టర్లు సిజేరియన్ ఎందుకు చేస్తారంటే?

టీవీ.. ఫోన్ పక్కన పెట్టండి : 
తింటూ టీవీ చూడడం మనలో చాలామందికి అలవాటే. అయితే భోజనం చేసేటప్పుడు దాని మీదే దృష్టి పెట్టాలి. మాట్లాడుకుంటూనో.. టీవీ, ఫోన్‌ చూసుకుంటూనో.. మరో పని చేసుకుంటూనో తినటం మంచిది కాదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఇష్టమైనవారితో కలిసి భోజనం చేయటం మంచిది. వేడి వేడిగా ఉన్న ఆహారమే తినాలి. ఇది రుచికరంగా ఉండటమే కాదు, త్వరగానూ జీర్ణమవుతుంది. వేడి ఆహారం వాయువును బయటకు వెళ్లగొడుతుంది, కఫాన్ని కూడా తగ్గిస్తుంది. 

అజీర్ణంగా ఉందా.. ఇలా చేయండి :
భోజనానికీ భోజనానికీ మధ్యలో కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. ఈ సమయంలో తిన్నది జీర్ణమవుతుంది. ఒకవేళ ముందు తిన్నది జీర్ణం కాకముందే మళ్లీ తిన్నారనుకోండి. సరిగా జీర్ణం కాని అన్నరసం కొత్త ఆహారంతో కలిసిపోయి దోషాలు పెరిగేలా చేస్తుంది. సమయానికి ఆకలి వేయటం, ఎలాంటి రుచి లేని త్రేన్పులు రావటం, ఒంట్లో ఉల్లాసం, మల విసర్జన సాఫీగా అవటం, దాహం వేయటం.. ఇవన్నీ ఆహారం సరిగా జీర్ణమవుతోందనటానికి సూచనలని గుర్తించాలి.

health tips
Common Things
eating

మరిన్ని వార్తలు