మెల్ల కన్ను అదృష్టం కాదు.. లోపం!

Submitted on 13 August 2019
Health Tips: Signs And Symptoms Of Eye Diseases In Kids

నిజానికి మెల్లకన్నుఅదృష్టం కాదు.. ఒక లోపం. ఐదేళ్ల వయసులోపే చికిత్స చేయించని పక్షంలో చిన్నారుల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే తల్లిదండ్రులూ జాగ్రత్త.. అంటున్నారు కంటి వైద్యులు. 

పుట్టుకతో 40 శాతం మాత్రమే : 
కంటి చూపు సామర్థ్యం పసిపిల్లల్లో పెద్దవాళ్లలాగా ఉండదు. అప్పటివరకు అమ్మ గర్భంలో చీకట్లో ఉండడం వల్ల అప్పుడే పుట్టిన బిడ్డ సరిగా చూడలేదు. చుట్టూ ఉన్న కాంతికి కళ్లు అలవాటు పడుతున్న కొద్దీ క్రమంగా చూపు పెరుగుతూ వస్తుంది. ఏదైనా వస్తువును చూడాలంటే ముందుగా కంటిపైన కాంతి పడి అది ఆ వస్తువు పైన ప్రతిఫలించాలి. దాంతో దాని ప్రతిబింబం కంటిలో ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మెదడు గ్రహించి కంటి ముందు ఉన్న దృశ్యాన్ని విద్యుత్ సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. అప్పుడే ఎదురుగా ఉన్నదాన్ని చూడగలం. ఇలా చూడగల శక్తి పుట్టుకతో 40 శాతం మాత్రమే ఉంటుంది. ఆ తరువాత కాంతి ప్రేరణతో ఐదేళ్ల వయసు వచ్చేసరికి దృష్టి సామర్థ్యం పెరుగుతుంది.  

మెల్ల ఎలా వస్తుందంటే :
సాధారణంగా పుట్టుకతోనే మనకు బైనాక్యులర్ సింగిల్ విజన్ ఉంటుంది. అంటే రెండు కళ్లూ కలిసి ఒకేసారి ఒకే దృశ్యాన్ని చూడగలుగుతాయి. కన్నుకి, మెదడుకి మధ్య ఉండే సమాచార సంబంధం వల్ల ఇది సాధ్యపడుతుంది. దీన్నే ఆక్యులో బ్రెయిన్ రిఫ్లెక్షన్ అంటారు. కాని కొందరిలో కన్నుకి, మెదడుకి మధ్య ఉండే ఈ కమ్యూనికేషన్ లో తేడా రావడం వల్ల మెల్ల వస్తుంది. కనుగుడ్డు చుట్టూ ఉండే కండరాల పనితీరు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

మెల్ల కన్ను ఉండడం అదృష్టం అని చాలామంది దాన్ని ఒక సమస్యగా అనుకోరు. అందుకే డాక్టర్‌కు చూపించరు. ఇలా మెల్ల కన్నుకు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మెల్ల ఉన్న పిల్లల్లో సాధారణంగా మానసికమైన సమస్యలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆత్మన్యూనత పెరిగి చదువులో గానీ, ఇతర యాక్టివిటీస్ లో గానీ వెనుకబడే ప్రమాదం ఉంది. 

5ఏళ్ల లోపే చికిత్స తప్పనిసరి: 
ఐదేళ్ల వయసు లోపుగానే కంటిలోపాలను గుర్తిస్తే సరైన, సమర్థవంతమైన చికిత్సను అందించగల అవకాశం ఉంటుంది. పదేళ్లు దాటితే ఇక పరిస్థితి చేయిదాటి పోతుంది. జన్యులోపాల వల్ల కలిగే మెల్లకన్నును బిడ్డ పుట్టిన ఏడాదిలోపు మాత్రమే సరిచేయగల అవకాశం ఉంది. కాబట్టి పుట్టిన వెంటనే కంటి పరీక్షలు చేయించడం అత్యవసరం. మెల్లను సరిచేయడానికి ఇప్పుడు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 

ఆఖరి అస్త్రం.. ఆపరేషన్ : 
ఇంత చిన్న పిల్లలకు శస్త్రచికిత్స చేయిస్తే ఎలా అనే సందేహంతో నిర్లక్ష్యం చేస్తే వయసు పెరిగే కొద్దీ లోపాలను సరిచేసే అవకాశం పూర్తిగా పోతుంది. కాబట్టి ఏ చిన్న అనుమానం ఉన్నా పరీక్ష చేయించి చికిత్స చేయించాలి. దృష్టిలోపం వల్ల మెల్ల వచ్చినప్పుడు ఆ లోపాన్ని సరిచేస్తే మెల్ల కూడా పోతుంది. అదేవిధంగా శుక్లం వల్ల వస్తే దానికి చికిత్స అందిస్తే మెల్లకన్ను కూడా తగ్గిపోతుంది. రెండు కళ్ల చూపు పోకుండా కాపాడటానికి చివరి ఆప్షన్ గా సర్జరీ అవసరం అవుతుంది. 

తల్లిదండ్రులదే బాధ్యత : 
చిన్నారులు తమకు కలిగిన బాధను చెప్పలేరు. తల్లిదండ్రులే గుర్తించి చికిత్స అందేలా చూడాలి. పెద్దవాళ్లలో మాదిరిగానే చిన్నారులకు కూడా అన్ని రకాల కంటి సమస్యలూ రావొచ్చు. గ్లకోమా, శుక్లాల వంటివి కూడా ఉండొచ్చు. కాబట్టి పుట్టినప్పటి నుంచి అవసరమైన కంటి పరీక్షలు చేయిస్తూ ఉండడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. 

health tips
Signs And Symptoms
Eye Diseases In Kids

మరిన్ని వార్తలు