జాగ్రత్త: గురు,శుక్ర వారాల్లో రాష్ట్రంలో వడగాలులు

Submitted on 13 June 2019
Heat waves in telangana

హైదరాబాద్‌ : ఈశాన్య మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు చెప్పారు. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని ఆయన అన్నారు. శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని  చెప్పారు.  

బుధవారం  రాష్ట్రంలోని  పలుప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండంల్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, మెదక్‌ల్లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు అయ్యింది, నిజామాబాద్, నల్గోండల్లో 41 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 39, హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.  

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు పెను తుఫాన్‌గా మారి.. గుజరాత్ తీరం దిశగా కదులుతోంది. వాయు కొద్దిగా దిశను మార్చుకుని గురువారం మధ్యాహ్నానికి దక్షిణాన ఉన్న వెరావల్ నుంచి పశ్చిమాన ఉన్న ద్వారక మధ్య ఎక్కడైనా తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో గాలిలో తేమ తగ్గి నైరుతి రుతుపవనాల కదలిక మందగమనంలో సాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ప్రస్తుతం కేరళ నుంచి తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు ఈ నెల 16 లేదా 17న తెలంగాణలో విస్తరించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 17న తొలకరి వానలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. 

Telangana
Weather
heat waves

మరిన్ని వార్తలు