నిప్పుల కొలిమిలా హైదరాబాద్ : బేగంబజార్ @ 40.3 డిగ్రీలు

Submitted on 13 June 2019
hyderabad hot summer

వేసవి కాలం ముగిసినా ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. రుతుపవనాలు వచ్చేసినా ఉక్కపోత తప్పడం లేదు. హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు, ఉక్కపోతకు నగరవాసులు విలవిలలాడిపోతున్నారు. నగరంలో మధ్యాహ్నం వేళల్లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం(జూన్ 12,2019) నగరంలో 37.7 డిగ్రీల గరిష్ఠ, 28.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఇవి సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికం. దీంతో ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సూర్య కిరణాలు చురుక్కుమనిపిస్తున్నాయి. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు సాహసం చెయ్యడం లేదు.

గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో ఉక్కపోత భరించలేకపోతున్నారు. రాత్రి సమయంలో 28 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కపోత ప్రభావం ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరో 2 రోజుల పాటు టెంపరేచర్లు ఇవే స్థాయిలో కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం గ్రేటర్‌ లోని పలు ప్రాంతాల్లో 40.41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బేగంబజార్‌ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అక్కడ అత్యధికంగా 40.3 డిగ్రీలు నమోదయ్యాయి.

రుతుపవనాలు విస్తరించే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేరళ నుంచి తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు జూన్ 16 లేదా 17న తెలంగాణలో విస్తరించవచ్చని అంచనా వేశారు. దాంతో వర్షాలు పడి వాతావరణం కూల్ అవుతుందని అంటున్నారు. అప్పటివరకు ఈ ఎండ కష్టాలు తప్పేలా లేవు.

షాపూర్‌నగర్‌-40.2
ఉప్పల్‌-39.7
రెడ్‌ హిల్స్‌-39.3
బాలాజీనగర్‌-39.3
ముషీరాబాద్‌-39
కుత్బుల్లాపూర్‌-39
మాదాపూర్‌-38.8
ఆసిఫ్‌నగర్‌-38.8

Hyderabad
hot summer
heat waves
Monsoon
begambazar
temperatures
sun

మరిన్ని వార్తలు