ఓఎల్ఎక్స్ లో కారు అద్దెకిస్తే.. అమ్మేస్తారు

Submitted on 14 July 2019
ఓఎల్ఎక్స్ లో కారు అద్దెకిస్తే.. అమ్మేస్తారు

హైదరాబాద్ : ఓఎల్ ఎక్స్ లో అద్దెకు తీసుకున్న వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని అమ్మేసుకుంటున్న అంత రాష్ట్ర  ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ డీసీపీ  వెంకటేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం పూణేకు చెందిన నదీష్ వినాయక్ కలంకార్, జార్జ్ కిస్టోఫర్ జోసఫ్, సుషాంత్ సురేష్ మార్గ్, బండు మనియా లు ముఠాగా ఏర్పడి ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.

కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ కార్లను ఓఎల్ఎక్స్, ఫేస్ బుక్ లలో అద్దెకు పెడుతుంటారు. అలాంటి వారిని గుర్తించి ఈ గ్యాంగ్ లీడర్ నిదీష్ వినాయక్ కలంకార్ వారిని సంప్రదిస్తాడు. మరో నిందితుడు సుషాంత్ సురేష్ ఘార్జ్ ఇంగ్లీషులో మాట్లాడుతూ  కార్లు అద్దెకు ఇచ్చే యజమానులకు మాయమాటలు చెప్పి నమ్మకం కలిగించి కారు అద్దెకు తీసుకుంటాడు. వారికి నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ చెక్కులు ఇస్తారు. అద్దెకు కారు తీసుకున్న తర్వాత దానికి ఫోటో షాపిలో నకిలీ ఆరీసీ సృష్టిస్తాడు కలంకార్.  ఇతడు ఫోటో షాపిలో దిట్ట. దీంతో విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా  పని చేస్తున్నట్లు ఐడీ కార్డు, ఆధార్ కార్డు నకిలీవి క్రియేట్ చేస్తాడు కలంకార్ . బండికున్నజీపీఎస్ సిస్టమ్ను మరో నిందితుడు జార్జ్ కిస్టోఫర్ జోసఫ్ తొలగిస్తాడు. దీంతో కారు ఎక్కడ తిరుగుతోందో యజమానికి తెలిసేది కాదు. వీరు ఒకసారి వాడిన సెల్ ఫోన్ నెంబరు మరోసారి వాడరు, ఎప్పటి కప్పుడూ ఫోన్ నెంబర్లు మారుస్తూ ఉంటారు. కారు యజమానులు ఫోన్ చేసినప్పుడు స్విచ్చాఫ్ రావటం, జీపీఎస్ తొలగించటం వల్ల కారు ఎక్కడ తిరుగుతోందో తెలియకపోవటంతో కొంత మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు వీరిపై దృష్టి సారించారు. బాధితులు ఇచ్చిన ఆధారాలతో  రంగంలోకి దిగిన పోలీసులు ఆకోణంలో దర్యాప్తు చేయటం ప్రారంభించారు. ఈ ముఠా అద్దెకు తీసుకున్న కార్లను హైదరాబాద్ పూణే, గోవా, పాండిచ్చేరిలలో అమ్మేస్తోంది. రాయదుర్గం పీఎస్ పరిధిలో చోరీ చేసిన మారుతీ సుజుకి ఎర్టిగా..స్విఫ్ట్ కార్లను గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన కార్లు పూణేలో ఉంచినట్లుగా తెలుసుకుని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ.37లక్షల విలువైన ఎర్టిగా, స్విఫ్ట్ లతో పాటు పూణేలో చోరీ చేసిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. పూణే, పాండిచ్చేరి, హైదరాబాద్ టోలి చౌక్ లో చోరి చేసిన మరో మూడు కార్లను పోలీసులు  స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. పరారీలో ఉన్న మరో నిందితుడు  బండు మనియా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Hyderabad
crime
OLX Rent cars

మరిన్ని వార్తలు