నేను డోర్ తెరిస్తే టీడీపీ ఫినిష్ : జగన్ సంచలన వ్యాఖ్యలు

Submitted on 13 June 2019
if i open door tdp will finish.. ap cm ys jagan

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. స్పీకర్ ఎన్నిక తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సంప్రదాయం, విలువలు, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై రచ్చ జరిగింది. సీఎం జగన్.. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చంద్రబాబులా రాజకీయాలు చేస్తే.. ఇవాళ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సభలో కూర్చునే వారు కాదన్నారు. ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. తనతో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను డోర్ తెరిస్తే.. చాలామంది రావడానికి రెడీగా ఉన్నారని అన్నారు. నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. 

సంతలో పశువుల్ని కొనుగోలు చేసినట్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను నాడు చంద్రబాబు కొనుగోలు చేశారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలను, అన్యాయాన్ని.. దేవుడు, ప్రజలు గనమించారని... ‘గూబ గుయ్’ మనేలా దేవుడు, ప్రజలు తీర్పు చెప్పారని జగన్ అన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలని చంద్రబాబు కొనుగోలు చేశారో.. అంతమంది మాత్రమే టీడీపీకి మిగిలారని చెప్పారు.

చంద్రబాబు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని సీఎం జగన్ మండిపడ్డారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చట్టానికి తూట్లు పొడిచారని, స్పీకర్ పదవిని దుర్వినియోగం చేశారని జగన్ ఆరోపించారు. ఈ అన్యాయమైన సంప్రదాయం కొనసాగకూడదని, చట్టసభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని.. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కొనసాగాలని.. మంచి సంప్రదాయం రావాలని జగన్ ఆకాంక్షించారు.

ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల కాలంలో తాము విలువలు పాటించాము అని జగన్ అన్నారు. నేను విలువలు పాటించడం రాష్ట్రమంతా చూసిందన్నారు. చంద్రబాబుకి 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారని.. అది కూడా 23వ తేదీనే దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడని జగన్ అన్నారు. దేవుడు, ప్రజలు ఇచ్చిన తీర్పు చూశాకైనా.. చంద్రబాబు మారాలని జగన్ కోరారు. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు మాట్లాడే మాటలు చూస్తుంటే కుక్క తోక ఎప్పుడూ వంకరే అని జగన్ విమర్శించారు.

AP CM YS Jagan
Chandrababu
TDP
YSR congress party
AP Assembly
words war

మరిన్ని వార్తలు