బ్యాంకుల్లో భారీ మోసాలు : 11 ఏళ్లలో రూ.2 లక్షల కోట్లు దోచేశారు

Submitted on 13 June 2019
Bank Frauds At 2 Lakh Crores

దేశీయ బ్యాంకుల్లో మోసాలు భారీగా పెరిగిపోయాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, ఆ తర్వాత ఎగ్గొట్టడం.. విదేశాలకు చెక్కేయడం.. ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ లాంటి వ్యాపారులు.. బ్యాంకులను ముంచేశారు. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. 11 ఏళ్లలో బ్యాంకుల్లో రూ.2.05 లక్షల కోట్ల మేర మోసాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఎక్కువ మోసాలు ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకుల్లోనే జరిగినట్టు ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి.

ఆ తర్వాత భారీగా మోసపోయిన బ్యాంక్ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు. ఈ బ్యాంకులో మోసపు ఘటనలు 2వేల 47 నమోదు అయ్యాయి. విలువ 28వేల 700 కోట్లు. ముఖ్యంగా డైమండ్ వ్యాపారి నీరవ్‌ మోడీ 13వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడు. పీఎన్‌బీ తర్వాత ఎస్బీఐకి మోసాల సెగ ఎక్కువగా తగిలింది. 23వేల 734 కోట్ల మేర మోసాలు జరిగాయి. ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తుకు బదులుగా ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు 53వేల 334 మోసపూరిత కేసులు నమోదయ్యాయి.

* పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2వేల 47 మోసాల కేసులు.. వీటి విలువ రూ.28వేల 700 కోట్లు
* ఐసీఐసీఐ బ్యాంకులో 6వేల 811 మోసాల కేసులు.. వీటి విలువ రూ.5వేల 033.81 కోట్లు
* ఎస్బీఐలో 6వేల 793 మోసాల కేసులు.. వీటి విలువ రూ.12వేల 358 కోట్లు
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 2వేల 497 మోసాల కేసులు.. వీటి విలువ రూ.1,200.79 కోట్లు
* బ్యాంక్ ఆఫ్‌ బరోడాలో 2వేల 160 మోసపూరిత కేసులు.. వీటి విలువ రూ.12వేల 962.96 కోట్లు

సామాన్య ప్రజలు లోన్ కోసం వెళితే సవాలక్ష ప్రశ్నలు అడిగి నెలల తరబడి తిప్పుకుని నిబంధనల పేరుతో చుక్కలు చూపించే బ్యాంకులు.. వైట్ కాలర్ నేరస్తులకు మాత్రం ఈజీగా లోన్లు ఇచ్చేస్తున్నాయి. వేల కోట్ల రూపాయలను వారికి అప్పనంగా ఇస్తున్నాయి. మోసం జరిగాక చింతించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. రుణాలు ఎగ్గొట్టిన వారి నుంచి తిరిగి డబ్బు వసూలు చేయలేకపోతున్నాయి.

bank fraud
2 lakh crores
PNB
SBI
HDFC
banks
RBI

మరిన్ని వార్తలు