సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు : వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష

Submitted on 20 June 2019
jail for man for abusing cm kcr in social media

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు  చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు  రూ.2వేలు జరిమానా కూడా వేసింది. నిందితుడు ఆకుతోట రామకృష్ణ  సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీన్ని  పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసుని విచారించిన కోర్టు నిందితుడు రామకృష్ణకి జైలు శిక్ష  విధించింది. నిందితుడు ఆకుతోట రామకృష్ణ యాదాద్రి భువనగిరి జిల్లా వాసి.

2017 సెప్టెంబర్ 15న భువనగిరి జిల్లాకి చెందిన ఆకుతోట రామకృష్ణ సీఎం కేసీఆర్ ను దూషించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పాతబస్తీ కుర్మగూడకు చెందిన ఇబ్రహిం అనే యువకుడు మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలతో సహా ఛార్జిషీటు దాఖలు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు గురువారం(జూన్ 20,2019) నిందితుడు రామకృష్ణకి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. రామకృష్ణ రెండు నెలలు రిమాండ్ లో ఉన్నాడు.

ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు రామకృష్ణని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. రెండు నెలలు రిమాండ్ లో ఉంచారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో ఇతరులపై ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయడం, దూషించడం, అనుచితంగా మాట్లాడటం వంటివి చేస్తే జైలుపాలు కాకతప్పదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ ని దూషించిన కేసులో పోలీసులు ఏపీలోని కృష్ణా జిల్లాకి చెందిన నవీన్ అనే యువకుడిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌ లో కేసీఆర్‌ గురించి నవీన్ అసభ్యకరంగా మాట్లాడాడు. దారుణంగా తిట్టాడు. ముఖ్యమంత్రిని అవమానించే విధంగా వీడియోను చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అత్యున్నత పదవుల్లో ఉన్నవారిని దూషించడం, వారి గురించి అభస్యకరంగా మాట్లాడటం చట్టరిత్యా నేరం. అలాంటి పనులను చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సోషల్ మీడియాలో ప్రధానిని దూషించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

CM KCR
ABUSE
social media
Ramakrishna
Jail
nampally court
DEROGATORY

మరిన్ని వార్తలు