కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం : ముఖ్యఅతిథిగా సీఎం జగన్

Submitted on 12 June 2019
june 21 kaleshwaram project inauguration

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌ను ముఖ్యఅతిథిగా పిలువనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కాళేశ్వరం ట్రయల్స్ రన్స్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పంపుల ద్వారా గోదావరి నీటిని విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 
కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీ డిజైనింగ్ చేస్తోంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. పనులు చివరి దశకు వచ్చాయి. ఈ వేసవిలోనే నీటిని అందించాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. జూన్ 21న ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకు జూన్ 17వ తేదీ సోమవారం విజయవాడకు కేసీఆర్ వెళ్లనున్నారు. ఆ రోజున జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని సీఎం జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉంటే వివిధ రాష్ట్రాల ముఖ్యనేతలను కూడా కేసీఆర్ ఆహ్వానించనున్నారని సమాచారం. జూన్ 15వ తేదీన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.

june 21
Kaleshwaram project
Inauguration
AP CM JAGAN

మరిన్ని వార్తలు