నేనెందుకు రాజీనామా చేయాలి : ఎదురుతిరిగిన కర్నాటక సీఎం కుమారస్వామి

Submitted on 11 July 2019
Karnataka crisis Why should I quit, Kumaraswamy

కర్నాటక రాజకీయం మలుపులు తిరగుతోంది. సంకీర్ణ సర్కార్ సంకటంలో పడింది. అధికార పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ కి చెందిన ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్ భేటీ తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారని, గవర్నర్ ని కలిసి రాజీనామా లేఖను అందజేస్తారని వార్తలు వచ్చాయి.

దీనిపై కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. రాజీనామా ప్రచారాన్ని ఖండించారు. నేనెందుకు రాజీనామా చేయాలని ఎదురుతిరిగారు. అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. అంతేకాదు గతాన్ని కూడా గుర్తు చేశారాయన. 2008-09 సమయంలో 18మంది బీజేపీ ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారారని, తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారని, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని.. అయినా యడ్యూరప్ప సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు అని కుమారస్వామి నిలదీశారు. ''మీరు యడ్యూరప్పని అడగండి. ఆ రోజు 18మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్నారు. అయినా మీరెందుకు రాజీనామా చేయలేదు'' అని యడ్యూరప్పని అడగండని కుమారస్వామి మీడియా ప్రతినిధులతో అన్నారు.

అధికార పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వానికి సంఖ్యా బలం తగ్గిపోయిందని, ప్రభుత్వం పడిపోయిందని, సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కుని కుమారస్వామి కోల్పోయారని బీజేపీ నేతలు అంటున్నారు. కుమారస్వామి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ రాజీనామాలను స్పీకర్ కావాలనే అంగీకరించడం లేదని 10మంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. సాయంత్రం 6లోపు ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలవాలని, మరోసారి రాజీనామాలను సమర్పించాలని చెప్పింది. అంతేకాదు.. రాజీనామాలపై స్పీకర్ ఇవాళే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

Karnataka crisis
Kumaraswamy
Yeddyurappa
CM
rebel mlas


మరిన్ని వార్తలు