23 రోజులు, 100 నియోజకవర్గాలలో పర్యటనలు..

08:54 - November 7, 2018

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచార ప్రణాళిక ఖరారైంది. ఈ నెల 12 నుంచి ఆయన తదుపరి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లా సభలతో పాటు నియోజకవర్గాల పర్యటనలూ ఇందులో ఉన్నాయి.  పార్టీ ముఖ్యనేతలతో సీఎం మంగళవారం సమావేశమై ప్రచార ప్రణాళిక గురించి చర్చించారు. దీని ప్రకారం  చివరి మూడు రోజుల పర్యటనలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 

దాదాపు 23 రోజుల పాటు నిరంతరం ఆయన సభల్లో పాల్గొననున్నారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనే వీలుంది. మొత్తంగా 100 నియోజకవర్గాల పర్యటనలు జరపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.  పార్టీ బలంగా ఉందని భావిస్తున్న సిద్దిపేట, సిరిసిల్ల, హుజురాబాద్‌, బాన్సువాడ తదితర కొన్ని నియోజకవర్గాల్లో అవసరమైతేనే ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు. హైదరాబాద్‌లో పర్యటనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కీలక సెగ్మెంట్లలో 3 రోజుల పాటు సభల్లో పాల్గొంటారు.   మరోవైపు తెరాస ఎన్నికల తుది ప్రణాళిక సిద్ధమైంది. ఎన్నికల కమిటీ మంగళవారం సీఎంకు సమర్పించింది. రెండు రోజుల పాటు పరిశీలించిన తర్వాత కేసీఆర్‌ కమిటీతో సమావేశమై ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేయించే అవకాశం ఉంది. అనంతరం తుది ప్రణాళికను విడుదల చేయనున్నారు.
12 స్థానాలపై చర్చలు.. 
సీఎం కేసీఆర్‌  12 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక జాబితాను పరిశీలించారు. ఇప్పటికే ప్రచారంలో, ప్రతిపాదనల్లో ఉన్న వారు గాక అనూహ్యంగా కొన్ని కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం మంగళవారం తెరాస అభ్యర్థులు పలువురికి ఫోన్లు చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచార సరళిని తెలుసుకొని, ఉత్సాహంగా ముందుకు సాగాలని సూచించారు.
 

Don't Miss